రివ్యూ

హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మల్, నిజామాబాద్ ప్యాకేజీ పనులపై మంత్రి హరీష్ రావు సమీక్ష.జల సౌధలో జరిగిన సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు, గుత్తేదార్లు పాల్గొన్నారు.ప్యాకేజీల వారీగా పనుల పురోగతిని మంత్రి హరీష్ రావు సమీక్షించారు.
28వ ప్యాకేజీ మెట్ పల్లి కెనాల్ కింద ఉన్న 1.15 లక్షల ఎకరాలకు ఈ సంవత్సరం నవంబర్ – డిసెంబర్ కల్లా నీరందించాలి.సెప్టెంబర్ నెలలోగా 27వ ప్యాకేజీలోని 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలి.28వ ప్యాకేజీలో 10 వేల ఎకరాలను నీరందించాలి.కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయంలోగా పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇంజనీర్లను ఆదేశించారు. ఇవాళ జల సౌధలో జరిగిన సమీక్షలో కాళేశశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మల్ జిల్లా ప్యాకేజీలు 27,28, నిజామాబాద్ జిల్లా ప్యాకేజీలు 20, 21 పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ నెలలోగా 27వ ప్యాకేజీలోని 13 వేల ఎకరాల ఆయకట్టుకు , 28వ ప్యాకెజీలో 10 వేల ఎకరాలకు నీళ్లందించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 27వ ప్యాకేజీలో 578 ఎకరాల భూసేకరణ నిధులను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.ఈ ప్యాకేజీలో 550 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని, 15 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉందని చీఫ్ ఇంజనీర్ శంకర్ రావు మంత్రికి వివరించారు. భూసేకరణకు అవసరమైన 30 కోట్లు విడుదలకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమీక్షలో మంత్రి చెప్పారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం 28 ప్యాకేజీ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి హరీష్ రావు ఈ పనులను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్యాకేజీ పరిధిలోని ఆయకట్టుకు నీరు ఇవ్వాల్సి ఉందని…పనుల్లో జాప్యం లేకుండా చూడలన్నారు. ఈ నెలాఖరులో 27, 28 ప్యాకేజీ పనులను స్వయంగా తాను పరిశీలిస్తానని చెప్పారు. 28వ ప్యాకేజీ పనుల కోసం మరో 20 కోట్లు విడుదల చేయనున్నట్లు చెప్పారు. 27వ ప్యాకేజీలోని నిర్మల్, 28వ ప్యాకేజి పరిధిలోని ముధోల్ కు నీరందించడమే లక్ష్యంగా పనులు వేగవంతం చేయాలన్నారు.

నిజామాాబాద్ జిల్లా 20, 21 ప్యాకేజీ పనుల పురోగతిపైన సమీక్ష:
నిజామాబాద్ జిల్లాలోని 20, 21వ ప్యాకేజీ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ ప్యాకేజీ పనుల్లో టన్నెల్ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వాటి లైనింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. అక్టోబర్- నవంబర్ కల్లా టన్నెల్ పనులు, పంప్ హౌస్ సర్జ్ పూల్ పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లకు, గుత్తే దార్లకు మంత్రి సూచించారు. 20, 21 ప్యాకేజీలలో రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద పైప్ ఇరిగేషన్ చేపడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. ప్యాకేజి 21 లో మెట్ పల్లి కెనాల్ కింద ఉన్న 1.15 లక్షల ఎకరాలకు ఈ సంవత్సరం నవంబర్ – డిసెంబర్ కల్లా నీరందించేలా పనులు పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పంప్ హౌస్, సబ్ స్టేషన్లు, పైపులు వేసి 1.15 లక్షల ఎకరాలకు నీరందించాలన్నారు. నిధుల విడుదల, చెల్లింపుల్లో ప్రభుత్వం వైపు నుంచి జాప్యం లేకుండా చూస్తామని, అదే రీతిలో గుత్తే దార్లు పనులను వేగవంతం చేసి అనుకున్న సమయంలోగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా సహకరించాలన్నారు. నిత్యం క్షేత్ర స్థాయిలో సిబ్బందిని పర్యవేక్షిస్తూ.. జాప్యాన్ని నివారించాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈ సమీక్షలో ఈ ఎన్. సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు, శంకర్ రావు, హరి రామ్, మధు సూదన్ రావు, గుత్తేదారులు పాల్గొన్నారు.