రేషన్ డీలర్ల సమ్మె చట్టవిరుద్ధం.- పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్.

హైదరాబాద్;
పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌ ఆదివారం పౌరసరఫరాల భవన్‌లో రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. మూడు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సమ్మె వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడతారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి సమ్మెను విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కమిషనర్‌ రేషన్‌ డీలర్ల సంఘం ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సమయానికి నిత్యావసర సరుకులు అందించడమే తెలంగాణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. అది తెలంగాణ పౌరసరఫరాల శాఖ ప్రథమ కర్తవ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు పౌరసరఫరాల శాఖ అన్ని చర్యలు చేపట్టింది.
ప్రతి నెల 85 లక్షల మంది పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. ఈ సరుకులు సకాలంలో లబ్ధిదారులకు అందించడం రేషన్‌ డీలర్ల కనీస బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించకండి.

ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేస్తుంది. దయచేసి సమ్మెను విరమించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. రేషన్‌ డీలర్ల సమ్మె చట్ట విరుద్ధం. తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ కంట్రోలర్‌ ఆర్డర్‌ 2016, నిత్యావసర సరుకుల చట్టం 1955 ప్రకారం నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారాన్ని ప్రభుత్వం కలిగి ఉంటుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సమ్మె విషయాన్ని పునరాలోచించుకోవాలి. రేషన్‌ డీలర్లు మొండిగా సమ్మెకు వెళ్లినా కూడా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు పౌరసరఫరాల శాఖ పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది. పేదలకు సరుకులు అందించే కనీస బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉంది. ఆ బాధ్యతను, కర్తవ్యాన్ని సమర్థంవంతంగా నిర్వర్తించే సామర్థ్యం కూడా శాఖ వద్ద ఉంది.