రైతు కోపం నాలుగు గ్రామాలకు శాపం. పవర్ ఆఫ్ ద కామన్ మ్యాన్.

పెద్దపల్లి:
రైతే కదా అని అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆ రైతు తన ప్రతాపం చూపాడు. ఫలితంగా ఏకంగా నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.పెద్దపల్లి జిల్లాలో ఓరైతు ఆవేదన, ఆక్రోశం ఓనాలుగు గ్రామాలకు కరెంటే నిలిపేసేలా చేసింది. తనకు నష్టపరిహరం చెల్లించాలని కోరుతూ ఓ రైతు సబ్‌స్టేషన్‌లో విద్యుత్ నిలిపేశాడు.ఏకంగా సబ్ స్టేషన్ కు తాళం వేసి నిరసన తెలిపాడు. ఈ ఘటన సంచలనం రేపింది.తన కుమారునికి విద్యుత్ కేంద్రంలో ఉద్యోగం కల్పిస్తానని నమ్మించి వ్యవసాయభూమిలో సబ్ స్టేషన్ ఏర్పాటుచేశారని తెలిపాడు. తీరా సమయానికి కాలయాపన చేస్తున్నారంటూ పెద్దపెల్లి జిల్లాలో మల్లెద్దుల కొమురయ్య అనే రైతు ఆందోళనకు దిగాడు. పెద్దపెల్లి జిల్లా రాగినేడు సబ్ స్టేషన్‌లో ఏకంగా విద్యుత్ నిలిపివేసి, కడుపు మంటతో సబ్ స్టేషన్‌కే తాళం వేసేశాడు కొమురయ్య. కొంరయ్య అనే రైతు వద్ద తన వ్యవసాయ భూమిలో సబ్‌స్టేషన్‌ నిర్మించడానికి తన భూమి కావాలని, విద్యుత్ అధికారులు సంప్రదించారు. అందుకుగాను కొమురయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని విద్యుత్ అధికారులు హామీ ఇచ్చారు. వారి కోరిక మేరకు తమ ఊరితో పాటు మరో నాల్గు గ్రామాలకు కూడా విద్యుత్‌ అందుతుందన్న భావనతో కొమురయ్య తన భూమిని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. 2 సంవత్సరాల క్రితమే విద్యుత్ అధికారులకు తన వ్యవసాయ భూమి 20 గుంటలను గ్రామ పంచాయితీ పాలకవర్గం, గ్రామస్తుల సమక్షంలో తీర్మానం కూడా చేసుకుని అప్పగించాడు. అయితే విద్యుత్ అధికారులు మాత్రం తన కుమారునికి ఇస్తామన్న ఉద్యోగం ఇవ్వలేదు.రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగెత్తిన కొమురయ్య మంగళవారం సబ్ స్టేషన్ పవర్ లైన్ కట్ చేసి, సబ్ స్టేషన్ కు తాళం వేశాడు. కుటుంబ సమేతంగా కొంరయ్య సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపాడు. తనకున్న 20 లక్షల రూపాయల విలువైన భూమిని, అలాగే 10లక్షల రూపాయల విలువైన బావిని సైతం పూడ్చేసి సబ్ స్టేషన్ నిర్మించారని చెప్పాడు. తనకు నష్టపరిహరం ఇవ్వక,కుమారునికి ఉద్యోగం ఇవ్వక సతాయిస్తున్నారని కొమురయ్య, ఆయన కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.సబ్ స్టేషన్ లో విద్యుత్ నిలిపివేయడంతో రాగినేడు, బ్రాహ్మణపల్లీ, కూర్మపల్లీ, అందుగులపల్లి 4 గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తనకిచ్చిన హామీలు నెరవేర్చేంతవరకూ సబ్‌స్టేషన్‌ ముందే బైఠాయిస్తానని కొమురయ్య అక్కడే కుటుంబంతో కలిసి బైఠాయించాడు. రైతుల భూములను లాక్కోవడం,వారికివ్వాల్సిన నష్టపరిహారాన్నివ్వకపోతే రైతుల ‘రెబెల్’ గా మారతారనడానికి ఇది సజీవ ఉదాహరణ.