రైతు వద్దకే కలెక్టర్..!

సిద్ధిపేట:
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు.. వివరాల సేకరణ ప్రధానం అని జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి అన్నారు.10రోజులలో ఐనాపూర్ లో.. ఒక్క రెవెన్యూ రికార్డు తప్పులేకుండా సరి చేయొచ్చని చెప్పారు.గ్రామస్తులు సహకరిస్తేనే.. రెవెన్యూ సమస్యలకు సులభంగా పరిష్కారం అని ఆయన అభిప్రాయపడ్డారు.ఐనాపూర్, వేచరిణి గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో వంద శాతం రెవెన్యూ రికార్డుల శుద్దీకరణకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు, పట్టాదారు పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం కింద అందిస్తున్న పంపిణీ కార్యక్రమంలో భూ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన నమూనా ప్రకారం వంద శాతం రికార్డుల శుద్ధీకరణకు తహశీల్దార్లు పాటించాల్సిన, అలాగే గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతులు, గ్రామ యువత, గ్రామంలోని పలు మహిళా స్వయం సహాయక సంఘాలు చేపట్టాల్సిన సూచనలు చేస్తూ.. మీరంతా సహకరిస్తే.. రెవెన్యూ సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుందని భావించి భూ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు.. వివరాల సేకరణ ప్రధానమని రైతుల వద్దకే అధికారులంటూ.. జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్ తో పాటు ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులంతా రైతు బాట పట్టారు.
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలం ఐనాపూర్ గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ కు శుక్రవారం ఉదయం కలెక్టర్ చేరుకున్నారు. మొదటగా అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న ఆహార విషయాలపై ఆరా తీస్తూ.. నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ మేరకు అంగన్ వాడీ కార్యకర్తలు కేంద్ర సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా రైతుబంధు పథకం ద్వారా పట్టాదారు పాస్ పుస్తకం, పెట్టుబడి సాయం కింద అందుతున్న డబ్బులు తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటూ.. 40 ఏళ్ల నుంచి ఆనాదిగా క్షేత్రస్థాయిలో ఉత్పన్నమవుతున్న రెవెన్యూ సమస్యలకు.. ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం లభిస్తున్నదని రైతులకు కలెక్టర్ చక్కటి అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన రైతులతో కలెక్టర్ సమావేశంలో భాగంగా గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ గంటపాటు ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు, పట్టాదారు పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం కింద అందుతున్న డబ్బులు భూ రికార్డుల ప్రక్షాళనలో సవరణలకు సంబంధించిన ఫార్మాట్ కు అనుగుణంగా తహశీల్దారుకు వంద శాతం రికార్డుల శుద్ధీకరణకు తహశీల్దారు, వీఆర్వో, గ్రామ ప్రజలు, రైతులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ యువత చేయాల్సిన అంశాలనును వారికి సవివరంగా తెలుపుతూ దిశానిర్దేశం చేశారు. ఇందుకు గానూ మండల తహశీల్దారు, ఆర్ఐ, వీఆర్వోతో పాటు గ్రామ సర్పంచ్, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతులు, గ్రామ యువత, గ్రామంలోని పలు మహిళా స్వయం సహాయక సంఘాలందరి సమన్వయంతో చేసుకుంటే సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చని గ్రామస్తులకు సూచించారు. గ్రామాలలో 40 ఏళ్ల నుంచి ఉత్పన్నమై ఉన్న రెవెన్యూ రికార్డుల సవరణల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు ప్రధానంగా ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ.. రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటి వరకు సేకరించిన, సేకరించాల్సిన ఆధార నెంబర్లను వెంటనే ఎల్ఆర్ యూపీలో నమోదు చేయించాల్సి ఉన్నదని తెలిపారు. గతంలో వెబ్ ల్యాండ్ లో కానీ, ఇప్పుడు ఎల్ ఆర్ యూపీ లో కానీ పేర్లు నమోదు కాకుండా కార్యాలయాల చుట్టూ తిరిగే రైతులను పట్టాదారులుగా రికార్డులో నమోదు చేయాల్సి ఉన్నదన్నారు. ప్రభుత్వ భూములల్లో అర్హులైన శివాని జామేదార్ అర్హత పీఓటీ, సాదా బైనామా కేసులకు పట్టాదారు పాస్ పుస్తకాలకు డిజిటల్ సంతకం చేయాల్సి ఉందని సూచించారు. పెండింగ్ లోని క్రయ, విక్రయాలు, పౌతి విరాసత్ కేసులను అమలు చేసి రికార్డులను నమోదు చేయాలన్నారు. తప్పుగా వచ్చి పంపిణీ చేసిన పాస్ పుస్తకాలను తిరిగి తెప్పించుకుని సవరించాలని, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాల కొరకు ప్రత్యేకించి డాటా పోర్ట్ చేసి, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం రాని వారి ఖాతాల వివరాలు సేకరించి వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పట్టా పాస్ పుస్తకం వచ్చి సర్వే నెంబర్లు తప్పిపోయిన పాస్ పుస్తకాలు, పట్టాదారుల వివరాలు సేకరించి ఆ సర్వే నెంబర్లను పాస్ పుస్తకాల్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఐనాపూర్ గ్రామంలో.. 51 తప్పులు సవరించాలి
ఐనాపూర్ గ్రామంలో జరిగిన రైతులతో కలెక్టర్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో 51 తప్పులు వచ్చాయని రెవెన్యూ రికార్డుల సవరణకు కావాల్సిన పలు కీలక అంశాలను గ్రామ రైతుల దృష్టికి తెచ్చారు. ఐనాపూర్ గ్రామంలో 1028 ఖాతాలు ఉన్నాయని 956 పట్టాదారు పాస్ పుస్తకాలు, 956 మందికి చెక్కులు పంపిణీ చేశామని చెబుతూ.. ఇంకా 22 మంది రైతులు రాలేదని, వీరితో పాటు చనిపోయిన 13 మంది పేర్లు రికార్డులలో ఎందుకు వచ్చాయని గ్రామస్తులకు వివరిస్తూ.. ఆరా తీశారు. ఊర్లో నోటీసు బోర్డులు పెట్టామని, రైతు సమన్వయ సమితి సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ స్వయం సహాయక సంఘాలు దృష్టి పెట్టలేకపోయారని, దీంతో పాటు మరో 7 ఖాతాలు క్రయ విక్రయాలు జరిపిన వారివి వచ్చాయని, అలాగే తండ్రి పేరిట భూమి ఉంటే ఇతరుల ఫోటోలు తప్పుడుగా 8 మంది ఫోటోలు వచ్చాయని.. ఇలా తప్పులు వస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావని వీఆర్వో ను కలెక్టర్ మందలించారు. ఇలాంటివన్నీ చాలా సున్నితమైన అంశాలుగా పరిగణించాలని సూచించారు. వీటన్నింటినీ సవరించాల్సిన బాధ్యత తహశీల్దారు, వీఆర్వోతో పాటు గ్రామస్తుల సహకారం కూడా అవసరమని చెప్పారు. రెవెన్యూ రికార్డు సవరణ సమస్యల పరిష్కారానికి గ్రామ పెద్దలు రెండు సమయం కేటాయించండని కోరారు.గ్రామంలోని రెవెన్యూ రికార్డుల సవరణ సమస్యల పరిష్కారానికి గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ స్వయం సహాయక సంఘాల సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారి భూ సమస్యల పరిష్కారానికి రెండు సమయం కేటాయించాలని., మీ గ్రామం కోసం., మీ గ్రామ రైతుల శ్రేయస్సు కోసం కనీసం గంట సమయమైనా కష్టపడాలని గ్రామస్తులకు కలెక్టర్ వెంకట్రామ్ హితవు పలికారు. పది రోజులలో ఐనాపూర్ గ్రామంలో ఒక్క రెవెన్యూ రికార్డు తప్పులు లేకుండా సరి చేసుకుందామని దిశా నిర్దేశం చేశారు. 40 ఏళ్ల నుంచి వచ్చిన తప్పిదాలను సవరించుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధుల పై ఉన్నదని కోరారు. ముఖ్యంగా వివరాల సేకరణ ప్రధానమని.. గ్రామస్తులు సహకరిస్తే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.

అంజయ్య కుటుంబానికి రేషన్ బియ్యం అందించాలి : డీఎస్ఓకు కలెక్టర్ ఆదేశాలు
పేద కుటుంబం సారూ.. రేషన్ బియ్యం ఇప్పించండని ఐనాపూర్ గ్రామానికి చెందిన నీలం అంజయ్య జిల్లా కలెక్టర్ కు మొర పెట్టుకున్నారు. నీలం అంజయ్య పక్షవాతం తో బాధ పడుతున్నానని, మా ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులం సారూ అంటూ.. నాకు ఫించన్ కూడా వస్తలేదని కలెక్టర్ కు విన్నవించారు. ఈ మేరకు కలెక్టర్ స్పందిస్తూ.. వెంటనే డీఎస్ఓ వెంకటేశ్వర్లు తో ఫోన్ లైనులో మాట్లాడారు. సాయంత్రం 4 గంటల వరకు ఐనాపూర్ గ్రామానికి వచ్చి పేద కుటుంబమైన నీలం అంజయ్య కు ప్రస్తుతం ఉన్న స్టాక్ లో నుంచి రేషన్ బియ్యం అందించాలని, త్వరగా వారికి రేషన్ కార్డు మంజూరు చేయించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ ను కలెక్టర్ ఆదేశించారు. ఆ తర్వాత ఐనాపూర్ గ్రామానికి రాసులాబాద్ గ్రామాలకు కొనుగోలు కేంద్రాలు కావాలని గ్రామస్తులు కోరగా.. తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో జరిపిన రైతులతో కలెక్టర్ సమావేశంలో గ్రామ రెవెన్యూ సమస్యలపై రైతులతో కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూ రికార్డుల సవరణకు సమిష్టిగా కలిసి కృషి చేద్దామని కలెక్టర్ పిలుపు నిచ్చారు
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా కలిసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.దేశ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘రైతు బంధు’ పథకాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి అన్నారు. మద్దూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల సమావేశానికి ట్రైనీ కలెక్టర్.. అవిశ్యంత్ పండా-ఐఏఎస్ తో కలిసి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ రికార్డుల సవరణకు సమిష్టిగా కలిసి కృషి చేద్దామని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా కలిసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. రానున్న కాలంలో కేవలం క్రయ, విక్రయాలకు సంబంధించిన సవరణలు మాత్రమే ఉంటాయని, తెలంగాణా రాష్టంలో త్వరలో రికార్డుల సవరణ ఉండబోదని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలలో పర్యటనలు చేస్తూ రైతు బంధు పథకం విషయం పై రైతులతో మమేకమై మాట్లాడుతుంటే.. ప్రతి ఒక్క రైతు నుంచి సంబురం వస్తున్నదని పెట్టుబడి సాయం చాలా బాగుందని రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 100 రోజుల పాటు భూప్రక్షాళన చేపట్టి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ,పంట పెట్టుబడి చెక్కులు రైతులకు అందించడం జరిగిందన్నారు. ఇంకేమైనా తప్పులు ఉండి చెక్కులు పాస్ పుస్తకాలు రాని వారు 10 రోజుల్లో పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందు కోసం గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ యువత, గ్రామంలోని ఎస్ హెచ్ జీలు.. అధికారులకు సహకరించాలని కలెక్టర్ వెంకట్రామ్ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్.. అవిశ్యంత్ పండా (ఐఏఎస్) సిద్ధిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి, కొముర వెళ్లి తహశీల్దారు భిక్షపతి, చేర్యాల తహశీల్దారు అరుణ, ఇతర రెవెన్యూ సిబ్బంది, ఆయా మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సభ్యులు తదితరులు ఉన్నారు.