రోడ్డు ప్రమాదంలో కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుర్మరణం

 

 

 

 

 

 

 

 

 

 

 

బెంగళూరు:
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ ప్రాణాలు కోల్పోయారు. గోవా నుంచి బగల్‌కోట్ వస్తుండగా తులిసిగిరి దగ్గర కారు ప్రమాదానికి గురైంది. భీమప్పతో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే భీమప్ప ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

సిద్దు భీమప్ప న్యామగౌడ ప్రయాణిస్తున్న కారు బగల్‌కోట్ సమీపంలోని తులసిగిరి దగ్గరకు రాగానే ఎదురుగా ఓ ట్రక్ వచ్చింది. డ్రైవర్ దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన భీమప్పను ఆయన అనుచరులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు డ్రైవర్‌ కూడా మృతి చెందాడు.

ఇటీవల జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జామఖండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ కులకర్ణిపై 2795 ఓట్ల మెజార్టీతో భీమప్ప గెలుపొందారు. సుమారు 15రోజుల పాటు తోటి ఎమ్మెల్యేలతో రిసార్ట్స్‌లో గడిపిన భీమప్ప రెండు రోజుల క్రిందటే తన స్వస్థలానికి వచ్చారు. గోవా వెళ్లి వస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భీమప్ప మృతితో కాంగ్రెస్ పార్టీ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు పెద్దఎత్తున నేతలు ఆస్పత్రికి తరలివస్తున్నారు.