లండన్ లో ట్రంప్ కు నిరసనకు రెడీ.

లండన్;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు మాటలు, ఆయన తీసుకొనే నిర్ణయాలపై ఆ దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాలన్నిటిలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయినా ట్రంప్ మాత్రం నేనింతే అంటూ తన పంథాను మార్చుకోవడం లేదు. ఈ నెల 11, 12 తేదీల్లో బ్రస్సెల్స్ లో జరిగే నాటో సదస్సుకు అమెరికా అధ్యక్షుడు హాజరు కానున్నారు. ఆ తర్వాత ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్తారు. రాజధాని లండన్ లో బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మేతో ట్రంప్ సమావేశం కానున్నారు. అయితే ప్రపంచ దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకొనే డొనాల్డ్ ట్రంప్ తీరుపై నిరసనలు తెలపాలని కొందరు ప్రదర్శనకారులు నిర్ణయించారు. దీనికి ఆ నగర ప్రథమ పౌరుడు, లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కూడా మద్దతు తెలుపుతున్నారు. ట్రంప్ నగరంలో పర్యటించేటపుడు ఆయనను వెటకారం చేస్తూ పసిపిల్లాడి వంటి ట్రంప్ ముఖంతో ఓ గాలి బుడగను ప్రదర్శించనున్నారు. విరాళాలతో తయారుచేసిన ఈ బుడగను సాదిక్ ఖాన్ స్వయంగా గాలిలోకి వదలనున్నారు. ఇదే కాకుండా అనేక చోట్ల సుమారుగా 50,000 మంది ప్రదర్శకులు ట్రంప్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొంటారని అంచనా. నిరసన ప్రదర్శనలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ఇంతకు ముందో సారి బ్రిటన్ పర్యటన రద్దు చేసుకొన్నారు.