లక్ష్మణ్ ని కూడా షర్ట్ విప్పమన్నాను


కోల్ కతా:

టీమిండియాకి విజయాల రుచి చూపించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు చెప్పగానే చారిత్రక లార్డ్స్ మైదానం బాల్కనీలో షర్ట్ విప్పి గాల్లో తిప్పుతూ చేసిన హంగామా కళ్ల ముందు కదలాడుతుంది. స్వదేశంలో భీకరమైన ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపై మట్టికరిపించి నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచినపుడు పట్టరాని ఆనందంలో దాదా రెచ్చిపోయాడు. పదహారేళ్ల కిందట సౌరవ్ చేసిన సందడి వీడియో కొన్ని వందల సార్లు చూసి ఉంటారు. ఇప్పటికీ ఇంగ్లండ్-భారత్ సిరీస్ అంటే చానెల్స్ ఆ క్లిప్ ని చూపిస్తాయి. అయితే సౌరవ్ అలా చేస్తున్నప్పుడు బాల్కనీలో పక్కనే ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ వద్దని వారించబోయాడట. గంగూలీ తన జెర్సీ తీస్తుంటే.. వద్దు. అలా చేయకని లక్ష్మణ్ తనకు చెప్పినట్టు గంగూలీ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే దాదా ఏ మాత్రం వినకుండా జోష్ లో షర్ట్ తీసి చిన్నపిల్లాడిలా గాల్లో గింగిరాలు తిప్పాడు.

తను అలా చేస్తుంటే వీవీఎస్ ఇప్పుడు నన్నేం చేయమంటావ్ అని అడిగాడని.. నువ్వు కూడా షర్ట్ విప్పు అని తాను లక్ష్మణ్‌కి చెప్పినట్లు గంగూలీ చెప్పాడు. లార్డ్స్ బాల్కనీలో నేను రైట్‌సైడ్ నిల్చున్నాను. నా పక్కనే లక్ష్మణ్, వెనుకాల హర్భజన్ సింగ్ ఉన్నాడు. మ్యాచ్ ముగియగానే నేను షర్ట్ విప్పబోతుంటే.. లక్ష్మణ్ ఆపడానికి ప్రయత్నించాడు. వద్దు.. అలా చేయొద్దని వారించబోయాడు. నేను జెర్సీ తీసిన తర్వాత మరి నేనేం చేయాలని అని లక్ష్మణ్ అడిగాడు. నువ్వు కూడా నీ షర్ట్ విప్పెయ్ అన్నానని గంగూలీ ఆ సంఘటన గుర్తు చేసుకున్నాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా దాదా ఈ ఆసక్తికర ఘటన చెప్పాడు. ఇండియాలో సిరీస్‌ను 3-3తో డ్రాగా ముగించిన తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ ఇలాగే షర్ట్ విప్పి చిందులేశాడు.