లోయలో పడిన బస్సు. 33 మంది మృతి.

శ్రీనగర్‌:

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు లోయలో పడి 33 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. కేశ్వాన్‌ నుంచి కిష్త్వార్‌ వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశామని జమ్మూ ఐజీ ఎంకే సిన్హా తెలిపారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఘటనపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.