వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం తథ్యం. -సీఎం కేసీఆర్.

హైదరాబాద్:
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం తథ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. దానం నాగేందర్ కు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 50 వేల కంటే ఎక్కువ మెజార్టీలతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం ఎన్నికల సంఘాన్ని అడుగుదామనుకుంటున్నానని, గత వారం ప్రధాని మోదీతో భేటీ సమయంలో ఈ అంశంపై చర్చించామని, ఎన్నికలకు వెళితే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే కర్తవ్యమని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారని, వాళ్లు గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా.. తనను మాత్రం గద్దె దింపుతామంటున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించామని, ఏ ఎన్నికలు వచ్చినా, టీఆర్ఎస్ ను ప్రజలు ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారని చెప్పిన కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రధాన అంశం సాగునీరు అని, 2020 జూన్ లో ఎటువెళ్లినా ఆకుపచ్చ తెలంగాణనే కనిపిస్తుందని, లక్ష కోట్ల రూపాయల పంట పండనుందని అన్నారు. దేశంలో ధనికులైన యాదవులు, మత్స్యకారులు మన దగ్గరే ఉన్నారని, అనేక రంగాల్లో చక్కని పద్ధతుల్లో ముందుకెళ్తున్నామని, కేవలం రాజకీయంగా మాట్లాడే శక్తులే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ దివాళా తీసిందని, అబద్ధాలు, అసత్యాలు చెబితే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. గత పాలకులు రైతులు, ప్రజలను ముప్పై ఏళ్లు బాధపెట్టారని, ఇప్పుడు తాము చేసిన పనిని గత పాలకులు ఎందుకు చేయలేదని అన్నారు. దానం నాగేందర్ కు, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. అనంతరం, కేసీఆర్ మాట్లాడుతూ, అందరి అభిమానంతో టీఆర్ఎస్ లో చేరిన దానం సహా అనుచరులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని అన్నారు. దానం టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తనకు నిన్ననే చెప్పారని, దానం టీఆర్ఎస్ లో చేరడమంటే సుఖపడటం కోసం కాదని, కష్టపడటం కోసమేనని, పని చేయాలన్న ఉద్దేశంతోనే దానం తమ పార్టీలో చేరారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక చరిత్ర, పునర్నిర్మాణం జరగడం మరో చరిత్ర అని, రాష్ట్ర పున్నర్నిర్మాణం టీఆర్ఎస్ కు ఓ పవిత్ర యజ్ఞంతో సమానమని అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో శత్రువులు ఎంత అడ్డుపడ్డా ఎదుర్కొని ముందుకెళ్లామని, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే పెన్షన్లు ఇచ్చామని అన్నారు. సమాజంలోని బాధ, ఆవేదన, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఓట్ల కోసం కాదని, పక్షపాత ధోరణి లేకుండా, మానవీయ కోణంలోనే సంక్షేమ పథకాల రూపకల్పన చేశామని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితాలు సుసాధ్యమని, అందుకు నిదర్శనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడమేనని అన్నారు. 90 శాతం పేదలు ఉన్న రాష్టం తెలంగాణ అని, పక్షపాత ధోరణి రూపు మాపేందుకు పథకాల లబ్ధిదారుల ఎంపికను అధికారుల చేతిలోనే పెట్టామని, లబ్ధిదారుల ఎంపికలో టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అనే భేదం చూపలేదని అన్నారు.