వారి ఆస్తులను బ్యాంకులు అమ్ముకోవచ్చు

వందలు, వేల కోట్లలో అప్పులు తీసుకొని పంగనామాలు పెట్టి పరారయ్యే బడాబాబుల దెబ్బతో ఉక్కిరిబిక్కిరవుతున్న బ్యాంకులు, రుణ సంస్థలకు ఊరటనిచ్చే మాట చెప్పింది మనీ లాండరింగ్ కేసుల అప్పీలేట్ ట్రిబ్యునల్. ఇకపై అలాంటి కేసుల్లో విచారణ, దర్యాప్తులు పూర్తయ్యే దాకా వేచి చూడకుండా ఈడీ, సీబీఐ, డీఆర్ఐ వంటి దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకొన్న ఆస్తులను అమ్మి బకాయి మొత్తం వసూలు చేసుకొనేందుకు అనుమతినిచ్చింది. దీంతో బ్యాంకులు కేసులు కొలిక్కి వచ్చేంత వరకు వేచి చూడకుండా త్వరగా వీలైనంత మొత్తం రాబట్టుకొనే వీలు కలిగింది.

జతిన్ ఆర్ మెహతాకి చెందిన విన్సమ్ డైమండ్స్ పై మనీ లాండరింగ్ కేసు నడుస్తోంది. ఈ సంస్థ తన ఆస్తులను హామీగా చూపించి పీఎన్బీ, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి బ్యాంకుల కన్సార్టియమ్ నుంచి భారీగా రుణాలు తీసుకొంది. రూ.4,687 కోట్ల రుణాలు ఎగ్గొట్టి జతిన్ మెహతా విదేశాలకు పారిపోయాడు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆ ఆస్తులన్నిటిని అటాచ్ చేసింది.అయితే ఆ ఆస్తులన్నీ జతిన్ తమకు హామీగా చూపించినవే కావడంతో బ్యాంకులు వాటిని వేలం వేసేందుకు అనుమతించాలని ట్రిబ్యునల్ ను కోరాయి.

ఈ కేసును విచారిస్తున్న అప్పీలేట్ ట్రిబ్యునల్ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తమకు హామీగా చూపిన ఆస్తుల వేలానికి బ్యాంకులు విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన పని లేదని, దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకొన్న ఆస్తులను వేలం వేసి తమ రుణం రికవర్ చేసుకోవచ్చని చెప్పింది. ఆస్తులను అటాచ్ చేయాలనుకుంటే ఈడీ వాటిని ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్నట్టుగా రుజువు చేయాలని సూచించింది.

ఇటీవల అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన జతిన్ ఆర్ మెహతా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీ వంటి వారిని ప్రస్తావిస్తూ వాళ్లు కుంభకోణాలకు పాల్పడి దేశం పరువు తీశారని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఓ పక్క మధ్యతరగతి ప్రజలు కడుపు కట్టుకొని బ్యాంకుల్లో డబ్బు దాచుకొంటే కొందరు దుర్మార్గులు బ్యాంకులను మోసం చేసి దేశప్రజల డబ్బు దోచుకొని పారిపోతున్నారని మండిపడింది.