విజయవాడలో గ్యాంగ్ రేప్.

అమరావతి:
విజయవాడలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ చదివి ఇంటి దగ్గర ఉంటున్న ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిలో ఆమెతో పరిచయమున్న ఓ యువకుడు పార్టీకని పిలిచి ఆమెకిచ్చిన కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి.. ఆమె స్ప్రుహ తప్పి పడిపోయిన తర్వాత నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. తన ముగ్గురు స్నేహితులకు సమాచారం అందించాడు. వారంతా కలిసి ఆ యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అయితే అత్యాచారం అనంతరం అక్కడే నిల్చుని ఉన్న ఆ యువకులను, కింద పడి ఉన్న యువతిని స్థానికులు గమనించి నున్న రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి మాట్లాడలేని స్థితిలో ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. నగరంలోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్‌ చదువుతున్న యువతి పాయకాపురం శివారుల్లోని నిర్మానుష్య ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. యువతితో పాటు ఆమె సహచర విద్యార్థులుగా చెబుతున్న మరికొందరు యువకులు అక్కడే ఉండటాన్ని గమనించిన స్థానికులు నున్న రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు యువతితో పాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్‌ ఏసీపీ శ్రావణి విలేకరులకు చెప్పారు. బుధవారం రాత్రి నున్నరూరల్‌ స్టేషన్‌కు వచ్చిన ఆమె కేసుకు సంబంధించి వివరాలను స్థానిక సీఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతి అపస్మారక స్థితిలో ఉందని ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. యువతి, వైద్యులు ఇచ్చే రిపోర్టును బట్టి చర్యలు ఉంటాయన్నారు.