విపక్షాల వలలో పడొద్దు. రైతులకు సాగునీటిని అందిస్తాం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై సమీక్ష. – మంత్రి హరీశ్ రావు.

హైదరాబాద్:
రాష్ట్ర వ్యవసాయ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, నిజామాబాద్ ఎం.పి. కవిత, మిషన్ భగీరధ వైస్ చైర్మన్, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ, ఆర్మూర్, బోదన్, కోరుట్ల శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఎ. జీవన్ రెడ్డి, షకీల్ హైమద్, విద్యాసాగర్ రావు, జగిత్యాల నియోజకవర్గ TRS ఇన్ చార్జి డా. సంజయ్, నీటిపారుదల శాఖ ENC మురళీదర్, శ్రీరాంసాగర్ C.E. శంకర్ పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు తక్కువగా కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి రాక బాగా తక్కువగా ఉన్నది. ప్రస్తుతం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న15 TMCలు త్రాగునీరుకు, డెడ్ స్టోరేజి, ఆవిరి నష్టాలకు బొటాబొటిన సరిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యత ప్రజలకు త్రాగునీటిని అందించడం. వచ్చే వేసవిలో ప్రజల త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోని ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభుత్వం బావిస్తుంది.ప్రస్తుతం SRSP ప్రాజెక్టు ద్వారా కాకతీయ కెనాల్, లక్ష్మీ కెనాల్, సరస్వతి కెనాల్ పరిదిలోని రైతాంగం అవసరాలను జాగ్రత్తగా అంచనా వేస్తున్నామని హరీశ్ చెప్పారు. “కొద్దిరోజులలో ప్రాజెక్టు ఎగువన మంచి వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరు చేరితే, ఆయకట్టు అవసరాలకు నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నది. ప్రస్తుత పరిస్థితిని జిల్లా శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో అంచనా వేస్తూ, నీటిపారుదల శాఖ క్షేత్రస్థాయి నుండి మానీటరింగ్ చేస్తున్నామని తెలిపారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకురావడానికే రూ. 1100 కోట్లతో పునరుజ్జీవన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే యాసంగి నాటికి పనులను పూర్తిచేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరందించాలని ప్రభుత్వం దృడసంకల్పం.
కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు తమ స్వార్ధం కోసం అమాయక రైతులను రెచ్చగొడుతున్నారు. రైతులు మోసపోవద్దని వినతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత సానుభూతితో వ్యవహరిస్తుంది. రైతు క్షేమమే ప్రభుత్వ లక్ష్యం. రైతులు పరిస్థితిని అర్ధం చేసుకోని ప్రభుత్వానికి సహకరించాలని మనవి చేస్తున్నాను” అని మంత్రి హరీశ్ తెలిపారు.