విప్ జారి గల్లంతయ్యిందే..

హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం టీడీపీకి చెలగాటం వైసీపీకి సంకటంగా మారింది. రేపు లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ జరగనుండటంతో పార్టీలన్నీ తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. తప్పనిసరిగా సభకు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని అవిశ్వాసానికి మద్దతిస్తున్న టీడీపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. చివరికి తెలంగాణ నుంచి తమ టికెట్ పై ఎంపీగా ఎన్నికై టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న మల్లారెడ్డికి సైతం టీడీపీ విప్ జారీ చేసింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్‌లు ఇచ్చింది. అయితే ఈ విషయంలో వైసీపీ నిస్సహాయ స్థితిలో పడిపోయింది.వైసీపీ లోక్‌సభ పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డితోపాటు, చీఫ్‌విప్‌, ఇతర నాయకులంతా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. ఆ పార్టీ గుర్తుపై పోటీచేసి గెలిచిన ఎంపీ కొత్తపల్లి గీత వైసీపీకి దూరంగా ఉంటున్నారు. మరో ఇద్దరు ఎంపీలు బుట్టా రేణుక, ఎస్‌పీవై రెడ్డి అనధికారికంగా టీడీపీ సభ్యులయ్యారు. వీరిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అవిశ్వాసం రూపంలో వైసీపీకి ఓ మంచి ఆయుధం దొరికింది. ఇప్పడు సభలో వైసీపీ ప్రాతినిధ్యం ఉంటే విప్ జారీ చేసే అవకాశం ఉండేది. పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు చేసిన ఎంపీలపై అనర్హత వేటు పడేది. అయితే వైసీపీ ఇప్పుడు ఆ ఆయుధాన్ని చేజేతులారా జారవిడుచుకొంది. సాధారణంగా పార్టీ తరపున సభాపక్ష నాయకుడు కానీ, చీఫ్‌ విప్‌ కానీ విప్‌ జారీ చేస్తారు. వైసీపీ ఎంపీల రాజీనామాల కారణంగా ఇప్పుడా రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సభలో మిగిలిన సభ్యులెవరితోనైనా ఇప్పిద్దామంటే వారిపై స్పీకర్ కు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. కాబట్టి ఆ అవకాశమూ చేజారిపోయింది. కాబట్టి తన తొందరపాటు నిర్ణయంతో పార్టీ మారిన ఎంపీలకు విప్ జారీ చేసి ఇరుకునపెట్టే ఓ మంచి అవకాశాన్ని వైసీపీ కోల్పోయింది.