విశాఖలో భానుడి ప్రతాపం. వడదెబ్బకు స్కూలు విద్యార్ధి బలి

విశాఖపట్నం:
ఎండల ధాటికి స్కూలు విద్యార్థి బలయ్యాడు. పాఠశాలలకు సెలవులు ప్రకటించినా, పట్టించుకోని ఓ ప్రైవేటు స్కూల్ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలిగొనడానికి కారణమైంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినా ఏపిలో వింత వాతావారణం నెలకొంది. సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల అత్యధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖపట్నం చినవాల్తేరులోని, నేతాజీ వీధిలోని కోటక్ స్కూల్ లో సాగర్ గుప్తా అనే 11 ఏళ్ల చిన్నారి ఎండ తీవ్రత తాళలేక చనిపోయాడు. 6వ తరగతి చదువుతున్న సాగర్, ఉదయం స్కూలుకి వెళ్లిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆపై పరిస్థితి విషమించి మృతి చెందాడు. వడదెబ్బతో తమ బిడ్డ మృతిచెందాడన్న విషయం తెలుసుకున్న సాగర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే పాఠశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు, మరీ ముఖ్యంగా విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాము ఆదేశాలు ఇచ్చినా స్కూళ్లు నడిపిస్తున్న పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.