వైరల్ అవుతున్న ఏనుగుల వీడియో.

తమిళనాడు:
తమిళనాడులో లోతైన బావిలో పడ్డ మూడు ఏనుగులను బయటికి తీసి అడవిలోకి తరలించారు అటవీశాఖ అధికారులు. ఈరోడ్ జిల్లా కడంబూర్ సమీపంలోని కనకుండూర్ గ్రామం చామరాజ నగర్, తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. దట్టమైన సత్యమంగళ అడవుల్లో ఉండే ఈ గ్రామంలోకి ఏనుగులు తరచూ వస్తుంటాయి. ఎప్పటిలాగే గ్రామ పరిసరాలలోకి వచ్చిన రెండు ఏనుగులు, వాటి గున్న అడవుల్లోకి వెళ్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అడవుల్లోని కొండ చరియలు విరిగిపడటంతో అవి కాలుజారి 60 అడుగుల లోతైన బావిలో పడ్డాయి. వాటంతట అవే వచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించి విఫలమయ్యాయి. దీంతో సాయం కోసం బిగ్గరగా ఘీంకారాలు చేయడం ప్రారంభించాయి. ఏనుగుల ఘీంకారాలు విన్న గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూసి అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. గ్రామస్థుల సాయంతో ఆరుగంటల పాటు శ్రమించిన అటవీ సిబ్బంది ఎట్టకేలకు ఆ మూడు ఏనుగులను సురక్షితంగా బావిలో నుంచి బయటికి తీసి అడవిలోకి తరలించారు. ఈ మూడు ఏనుగులను రక్షించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.