వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యం. – మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి.

హైదరాబాద్:
వ్యవసాయ యంత్ర పరికరాల పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిపారు. సచివాలయంలోని తన చాంబర్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విత్తనం వేసిన దగ్గర నుండి పంట నూర్పిడి వరకు అంతా యంత్రాల సహాయంతోనే జరగాలన్నారు. యంత్రాల వలన పెట్టుబడులు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయి. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. మనుషులతో వ్యవసాయ పనులు చేయించితే రైతులకు ఖర్చు భారీగా పెరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ యంత్రీకరణకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుంది. దుక్కి దున్నడానికి ట్రాక్టర్లను, పంట నూర్పిడికి హార్వేస్టర్లను సబ్సిడీపై అందిస్తున్నాం. అదేవిదంగా విత్తనాలు వేయడానికి, వరి నాట్లు వేయడానికి అవసరమైన యంత్రాలను కూడా ఈ ఏడాది నుండి అందించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో మొత్తం కోటి ఇరవై లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు సాగునీరందుతుంది. ఇంత బారీ స్థాయిలో వరి నాట్లు వేయడానికి కూలీలు దొరకరు. ప్రతి మండలానికి పది చొప్పున రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 5000 వరి నాటే యంత్రాలను సబ్సిడీపై అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. వ్యవసాయ యంత్రీకరణకై ముఖ్యమంత్రి గారు ఎంత మొత్తం అయినా కెటాయించడానికి సిద్దంగా ఉన్నారు. దీనికై రైతులకు సులువుగా ఉండటంతో పాటు స్థానిక పరిస్థితులకు అనువుగా ఉండే యంత్రాలను అందుబాటులోకి తేవాలని ప్రతినిధులను కోరారు. మన దేశంలో చిన్న కమతాలు కలిగిన రైతులు ఎక్కువ. వారికి అనువైన యంత్రాలను అందుబాటులోకి తేవాలని మంత్రి సూచించారు. అదేవిదంగా విత్తనాలను విత్తుకోవడానికి అవసరమైన డ్రమ్ సీడ్ యంత్రాలను బారీ ఎత్తున రైతులకు అందించాలని, ఇందుకు ఎంత ఖర్చయినా వెనకాడావద్దని అధికారులకు సూచించారు. కంపెనీలు డెమోగా కొన్ని జిల్లాలలో రైతుల పొలాలలో నాటు వేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమీషనర్ యం. జగన్మోహన్ IAS, ఉద్యానశాఖ డైరెక్టర్ యల్. వెంకట్రామి రెడ్డి, PJTSAU శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ది, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.