శరత్ కుటుంబాన్ని ఓదార్చిన టిఆర్ఎస్ నాయకులు.

హైదరాబాద్:
అమెరికాలో చనిపోయిన తెలంగాణ విద్యార్థి కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బొంతు రామ్మోహన్, ఎంపీలు బండ ప్రకాశ్, బాల్క సుమన్ ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు పరామర్శించారు. అమెరికాలో తెలుగు విద్యార్థులపై కాల్పులు ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ నగరం కొత్తవాడకు చెందిన శరత్ అనే విద్యార్థిపై శుక్రవారం రాత్రి కాల్పులు జరగడంతో తీవ్ర గాయాలపాలై మరణించారు. శరత్ మిస్సోరిలోని క్యాన్సర్ ప్రాంతంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.రామ్మోహన్, మాలతిల ఏకైక పుత్రుడు శరత్ అమెరికాలో జరిగిన కాల్పులలో మరణించడం పట్ల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్ర సంతాపం ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఈ దురదృష్టకర సంఘటన జరిగిందని, దుండగులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దుండగులను వీలైనంత త్వరలో పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున భారత దౌత్య అధికారులు, అమెరికా ఎంబసీ అధికారులతో మాట్లాడామని చెప్పారు. దుండగులను గుర్తించేందుకు 10వేల డాలర్ల పారితోషికాన్ని అమెరికా అధికారులు ప్రకటించారని తెలిపారు. భౌతిక కాయాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుత్రుని మరణవార్త విన్నప్పటి నుంచి తల్లి మాలతి కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉండడం వల్ల చాలా బలహీనమైందని, డాక్టర్లు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ మరణవార్త విన్నవెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారని, ఈ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు.అమెరికాలోని దురదృష్టకర సంఘటనలో శరత్ మృతిచెందడం పట్ల పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటి రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శరత్ మరణం గురించి తెలిసిన వెంటనే సిఎం కేసిఆర్ ఈ కుటుంబానికి అండగా ఉండాలని, కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు మమ్మల్ని పంపించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపున శరత్ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లాలనుకుంటే అత్యవసర వీసాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అక్కడున్న శరత్ స్నేహితులు ఇక్కడకు రావాలనుకున్నా వారికి కూడా వీసాలు ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికాలో శని, ఆదివారాలు అధికారిక కార్యాలయాలన్నింటికి సెలవులుండడంతో భౌతిక కాయం హైదరాబాద్ తీసుకురావడానికి 4,5 రోజులు పడుతుందని చెప్పారు. శరత్ హత్యపై భారత దౌత్య అధికారులు, అమెరికా అధికారులతో మాట్లాడుతున్నామని, దుండగులను వెంటనే గుర్తించి తగిన శిక్ష వేయాలని కోరామని చెప్పారు. కేన్సర్ పట్టణ ప్రాంతంలో తెలుగువారు చాలామంది ఉన్నారని, వారంతా కూడా అక్కడ సాయం చేస్తున్నారని తెలిపారు. శరత్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండ అందిస్తుందని హామీ ఇచ్చారు.