శాంతి కోసం బాబ్రీ మసీదు వదిలేస్తాం.

న్యూఢిల్లీ:
వివాదాస్పద బాబ్రీ మసీదు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు షియా వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అయోధ్య అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపాలా? వద్దా అనే విషయంపై సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ల త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. జాతీయ ప్రయోజనాల రీత్యా తాము వివాదాస్పద ప్రాంతాన్ని వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు షియా వక్ఫ్ బోర్డు కోర్టుకు తెలిపింది. దానిని రాజ్యాంగ ధర్మాసనానికి పంపాల్సిన అవసరం లేదని చెప్పింది. బాబ్రీ మసీదు షియాల సంరక్షణలో ఉన్న ప్రదేశమని.. అందులో భారతదేశంలోని ముస్లింల తరఫు ప్రతినిధులుగా సున్నీ వక్ఫ్ బోర్డు కానీ ఇతరులెవరి జోక్యం కానీ అనవసరమని స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో మాట్లాడే అర్హత షియా వక్ఫ్ బోర్డుకు లేదని సుప్రీంకోర్ట్ సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ వాదించారు. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు బమియాన్ బుద్ధులను ధ్వంసం చేసినట్టు కొందరు హిందూ తాలిబాన్లు బాబ్రీ మసీదును నేలమట్టం చేశారని అన్నారు. ఒకసారి విధ్వంసమయ్యాక ఏం చేయగలమన్న వాదన సమర్థనీయం కాదని ధవన్ అభిప్రాయపడ్డారు.