శాకాహారిగా మారిన కోహ్లీ!!

న్యూఢిల్లీ:

క్రీడా ప్రపంచంలోని ఆటగాళ్లు మాంసాహారాన్నే ఎక్కువ ఇష్టపడతారని అనుకుంటారు. నాన్ వెజ్ తింటే క్రీడాకారుల స్టామినా పెరుగుతుందని చెబుతారు. ఇది ఎంత నిజమో తెలియదు కానీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఇది ఉత్త అపోహే అంటున్నాడు. మాంసం పూర్తిగా మానేసి శాకాహారిగా మారిన తర్వాతే తన ఆట తీరు మెరుగైందని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఈ రన్ మెషీన్ చెబుతున్నాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం కెప్టెన్ కోహ్లీ నాలుగు నెలలుగా జంతువుల ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలను ముట్టడం లేదు. గత నాలుగు నెలల నుంచి విరాట్ పూర్తి వెజ్ భోజనమే చేస్తున్నాడు. దీంతో మునుపటి కన్నా ఎక్కువ బలం వచ్చినట్టనిపిస్తోందని చెబుతున్నాడు. ఆహారంలో మార్పుతో తన జీర్ణ శక్తి మెరుగైందని కోహ్లీ చెప్పాడు. సాధారణంగా మాంసం, గుడ్లు, డెయిరీ ఉత్పత్తులను ఆహారంలో తీసుకోవడం విరాట్ కి అలవాటు. అలాంటిది ఇప్పుడు కేవలం ప్రోటీన్ షేక్, కూరగాయలు, సోయా మాత్రమే తింటున్నాడు. గుడ్లు, డెయిరీ ప్రోడక్ట్స్ ని కూడా దూరం పెట్టేశాడు.విరాట్ కోహ్లీకి నాన్ వెజ్ వంటకాలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా బిర్యానీ, బట్టర్ చికెన్, ఛోలే భటూరే అంటే ప్రాణం. కానీ ఫిట్ నెస్ కోసం వాటన్నిటినీ వదిలేశాడు. ఇప్పుడు పూర్తిస్థాయిలో శాకాహారిగా మారిపోయాడు. ఈ మార్పు కారణంగానే మునుపు మైదానంలో భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయే విరాట్ ఇప్పుడు కూల్ గా కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోహ్లీ భార్య అనుష్కా శర్మ కొద్దికాలం క్రితమే శాకాహారిగా మారాలని నిర్ణయించుకొని మూడున్నరేళ్లుగా వెజిటేరియన్ భోజనం తింటోంది.