‘సంజూ’లో ఏ కేరక్టర్లలో ఎవరు? రేపు విడుదల కానున్న సంజూ.

ముంబయ్:
బాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. నీర్జా, ద డర్టీ పిక్చర్, భాగ్ మిల్ఖా భాగ్, మేరీ కోమ్, ఎంఎస్ ధోనీ వంటి బయోపిక్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్లిక్ కావడంతో హిందీ నిర్మాతలు ఈ ఫార్ములాని నమ్ముకొని మరిన్ని బయోపిక్ లు నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అదే కోవలో బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ బయోపిక్ సంజూ జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాలీవుడ్ అతిపెద్ద బ్యాడ్ బాయ్ జీవితంలో జరిగిన షాకింగ్ సంఘటనలను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మున్నాభాయ్ సిరీస్, త్రీ ఇడియట్స్ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ హిరానీ డైరెక్టన్ లో వస్తున్న ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ టైటిల్ రోల్ సంజూగా నటించాడు. ఈ సినిమాలో అనుష్క శర్మ, సోనమ్ కపూర్, పరేష్ రావల్, బొమన్ ఇరానీ, దియా మీర్జా, మనీషా కొయిరాలా, విక్కీ కౌషల్, జిమ్ సర్బ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనేక అనూహ్య మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్న దత్ జీవితంలో ఎవరు ఏ పాత్రలు పోషించారనేది చర్చనీయాంశంగా మారింది. దత్ భార్య మాన్యతగా దియా మీర్జాగా కనిపించనుంది. ఇక సంజయ్ జీవితం గురించి పరిశోధించే జర్నలిస్ట్ గా అనుష్క శర్మ నటిస్తోంది. సంజూ ఆప్త మిత్రుడిగా విక్కీ కౌశల్ నటించాడు. 80ల చివరలో, 90ల ప్రారంభం వరకు దత్ తో ప్రేమాయణం నడిపిన నటి పాత్రను సోనమ్ కపూర్ పోషిస్తోంది. పరేష్ రావల్, మనీషా కొయిరాలా సంజయ్ దత్ తల్లిదండ్రులు సునీల్ దత్, నర్గీస్ దత్ పాత్రల్లో కనిపిస్తారు. ఇక ప్రముఖ టీవీ నటి కరిష్మా తన్నా మాధురీ దీక్షిత్ గా నటించినట్టు చెబుతున్నారు. ఇండస్ట్రీలో సంజయ్ కి అత్యంత ఆప్తుడైన సల్మాన్ ఖాన్ గా జిమ్ సర్భ్, కాంటే దర్శకుడు సంజయ్ గుప్తాగా బొమన్ ఇరానీ నటించారు.