“సంజూ” చిత్రాన్ని ఉతికిపారేసిన ‘పాంచజన్య.’

ఎస్.కె.జకీర్.
బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్యాడ్ బాయ్ సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ‘పై అటు విమర్శకులు, ఇటు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కుంభవృష్టి కురుస్తోంది. ఈ సినిమా ఎన్ని ప్రశంసలు పొందుతోందో.. అంతకు మించిన విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) అధికార పత్రిక, పాంచజన్య- సంజూపై కలం ఝుళిపించి చీల్చి చెండాడింది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తన ప్రియమిత్రుడు సంజయ్ దత్ ఇమేజ్ కాపాడేందుకు ఈ సినిమా తీసినట్టున్నాడని విమర్శించింది. అండర్‌వరల్డ్‌ను, సంజయ్ అవలక్షణాలను పొగుడుతున్నట్లు ఉందని ఆ పత్రిక అభిప్రాయపడింది.
ముంబై పేలుళ్లలో దోషిగా తేలి సంజూ అరెస్ట్‌ కావడం, కూతురిపై అతని ప్రేమానురాగాలను పాంచజన్య ప్రస్తావించింది. సంజయ్ దత్‌కు లేని అవలక్షణం లేదు. 1993 బాంబు పేలుళ్లు, హింసాకాండలో అతనికి పాత్ర ఉంది. రహస్యంగా మారణాయుధాలు దాచాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. కొన్నేళ్లుగా కూతురిని కలవనేలేదు. సినిమాలో అతనే స్వయంగా 308 మందికి పైగా అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. సంజూ బాబాది ఇలాంటి చరిత్ర అని పాంచజన్య పత్రిక ఏకి పారేసింది. ఇలాంటి వాడిని ఓ హీరోగా చూపించడం కరెక్టేనా? అతన్ని బాలీవుడ్ ఓ ఆదర్శవంతమైన వ్యక్తిగా చూపించాలనుకుంటున్నదా? అని ప్రశ్నించింది.దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ హిందూ వ్యతిరేకి అని ఆరోపించింది. హిరానీ ఇంతకు ముందు తీసిన పీకే సినిమా హిందువులకు వ్యతిరేకంగా ఉందని విమర్శించింది. హాలీవుడ్ ఓవైపు మన రామానుజన్‌ను ఆకాశానికెత్తుతూ ‘ద మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ‘ సినిమా తీస్తే.. బాలీవుడ్ మాత్రం అండర్‌వరల్డ్‌కి భట్రాజులుగా మారిందని పాంచజన్య విమర్శించింది. అండర్ వరల్డ్‌పై సినిమాలు తీయడానికి గల్ఫ్ నుంచి పెట్టుబడులు వస్తున్నాయా అని ఆ పత్రిక నిలదీసింది.సంజయ్ దత్ ఏ ఘనకార్యం సాధించాడని అతని జీవిత చరిత్ర సినిమా తీశారని పాంచజన్య ఎద్దేవా చేసింది.