సగానికి తగ్గిన విద్యుత్ కొనుగోలు వ్యయం.

న్యూ ఢిల్లీ:
గత కొద్ది వారాలుగా విద్యుత్ కొనుగోలు ఖర్చులు సగం తగ్గాయంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నమ్మలేని నిజం. దేశమంతటా విస్తరించిన రుతుపవనాల కారణంగా కురిసిన వానలు విద్యుత్ డిమాండ్ బాగా తగ్గించాయి. దీనికి తోడు సౌర విద్యుత్, గాలి మరల వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి పెరగడంతో సరఫరా పెరిగింది. ఇవన్నీ కలిసి దేశంలో విద్యుత్ కొనుగోలు ఖర్చులను 50% తగ్గించాయి. ఇదే ఒరవడి మరికొంత కాలం కొనసాగితే చూస్తేనే షాకిచ్చే విద్యుత్ బిల్లుల నుంచి వినియోగదారులకు ఉపశమనం లభించనుంది. ఇండియా పవర్ ఎక్స్ఛేంజీ దగ్గర మే చివరి నాటికి యూనిట్ కి సగటున రూ.6.20గా ఉన్న విద్యుత్ కొనుగోలు వ్యయం గత వారం రూ.2.91కి తగ్గింది. సోమవారం ఉదయం యూనిట్ విద్యుత్ కి రూ.8 ఖర్చు చేయాల్సి రాగా తర్వాత అది ఇటీవలి కాలంలో అత్యంత కనిష్ఠంగా రూ.2.13కి పడిపోయింది. రోజువారీ సగటులో చూస్తే యూనిట్ వ్యయం కేవలం రూ.3.60 మాత్రమే. ఈ తగ్గుదలకు అధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా గాలిమరల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ప్రతి వారం 120 మిలియన్ యూనిట్లు పెరుగుతూ వస్తోంది. ఇది జల విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి, సరఫరాల మధ్య లోటుని భర్తీ చేస్తోంది. దేశంలోని చాలా నగరాల్లో కురిసిన వానలు విద్యుత్ డిమాండ్ ను దాదాపుగా 5,000 మెగావాట్లు తగ్గించాయి. జూన్ ప్రారంభంలో 1000 మెగావాట్ల కంటే తక్కువగా ఉన్న సరఫరా లోటు మాసాంతానికి 700 మెగావాట్ల కిందికి పడిపోయింది.సాధారణం కన్నా ముందుగా దేశంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 15 రోజులు ముందుగానే దేశమంతటా విస్తరించాయి. ముందుగా దక్షిణ, పశ్చిమ భారతదేశంలో విస్తారంగా భారీ వర్షాలు కురిశాయి. ఆ తర్వాత 12 రోజులపాటు స్తబ్దంగా ఉన్న రుతుపవనాలు మళ్లీ పుంజుకోవడంతో వారం రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పంజాబ్, కొంకణ్, గోవా వంటి ప్రాంతాల్లో అధికంగా వర్షపాతం నమోదు కావడంతో విద్యుత్ కి డిమాండ్ తగ్గింది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయానికి, పట్టణాల్లో ఇతర అవసరాలకి విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో జల విద్యుదుత్పత్తి ప్రారంభించేంత నీటిమట్టాలు రిజర్వాయర్లలో రాలేదు. అయితే సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి అధికంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో డిమాండ్, సప్లయ్ ల మధ్య వ్యత్యాసం కనిపించడం లేదు. దీంతో పవర్ ధరలు బాగా తగ్గాయి. పవర్ ఎక్స్ఛేంజీ దగ్గర ఎక్కువ ఖరీదుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్న గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఇది కచ్చితంగా శుభవార్తే.