సమ్మె చేస్తే రేషన్ డీలర్ షిప్ రద్దు. – తెలంగాణ పౌర సరఫరాల శాఖ వార్నింగ్.

హైదరాబాద్:
నిత్యావసర సరుకులు అందించే సామాజిక బాధ్యతను విస్మరించి సరుకుల పంపిణీకి ఆటంకం కలిగించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంగళవారం హెచ్చరించింది. రేషన్ డీలర్ల సమ్మె నోటీసుపై ఈ శాఖ తీవ్రంగా స్పందించింది.
‘పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్‌ డీలర్లపై కూడా అంతే ఉంది.
పేదలకు నష్టం, కష్టం కలిగించే చర్యలకు పాల్పడడం సరైన విధానం, పద్ధతి కాదు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఈ నెల 28వ తేదీ వరకు మీసేవ కేంద్రాల్లో రేషన్‌ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్‌ఓ (రీలీజ్‌ ఆర్డర్‌) తీసుకోని ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం డీలర్లకు విజ్ఞప్తి చేసింది. నిర్దేశించిన గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ కంట్రోలర్‌ ఆర్డర్‌ 2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారాన్ని కూడా ప్రభుత్వం కలిగి ఉంది. కుటుంబంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం కిలో రూపాయి చొప్పున ప్రతి నెల ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తూ అవసరమైన ఆహార భరోసా కల్పిస్తుంది. సమ్మె పేరుతో పేద ప్రజల నోటికాడి ముద్దను అడ్డుకోవద్దు. పేద ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించాలని ప్రభుత్వం మరోమారు రేషన్‌ డీలర్లకు విజ్ఞప్తి చేసింది. నిత్యావసర సరుకులు పంపిణీకి ఆటంకం కలిగిస్తూ సమ్మె చేయడం పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఇటువంటి చర్యలకు పాల్పడితే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతుంది. రేషన్‌ సరుకులు అందుతాయో లేదో అని పేదప్రజలు ఆందోళన చెందొద్దు. సకాలంలో సరుకులు అందించడానికి పౌరసరఫరాల శాఖ ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ చర్యల ద్వారా సరుకుల పంపిణీకి పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉంది’ పౌర సరఫరా ల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు.