‘సాధువు’ వేషంలోని నేరగాళ్ల కు అడ్డా అయోధ్య.

లక్నో:
అయోధ్య నగరం ఇంటా, బయటా కాషాయం ధరిస్తూ సాధువుల వేషధారణలో తలదాచుకుంటున్న నేరగాళ్ల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుండటంపై ఉత్తరప్రదేశ్ సర్కార్ కొరడా తీసింది. సీఎం ఆదేశాలతో అసలు సాధువులు ఎవరో, నకిలీలు ఎవరో, స్థానికులెవరో తెలుసుకునే వెరిఫికేషన్ ప్రక్రియను ఫైజాబాద్ జిల్లా యంత్రాగం చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న పౌరుల సమాచార ధ్రువీకరణ ప్రక్రియను పోలీసులు చురుగ్గా సాగిస్తున్నారు. పోలీసుల చర్యపై అయోధ్యలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లోని సాధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో తమ (సాధువుల) ఉనికిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. ‘నీచమైన నేరాల్లో దోషులుగా ఉన్న వాళ్లు అనేకమార్లు అయోధ్యకు వచ్చి సాధువుల వేషంలో బతికేస్తుండటం ముమ్మాటికీ నిజం. గతంలో కూడా పోలీసులు ఇదే తరహా విచారణలు చేపట్టారు. నిజమైన సాధువుల ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. వారి ఆటకట్టించడం మంచి పనే. అలాంటి వ్యక్తులను గుర్తించిన తర్వాత వారిని కఠినంగా శిక్షించాలి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి అలాంటి జనం ఇక్కడకు వస్తుంటారు. నేపాల్ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు’ అని రామజన్మభూమి ఆలయానికి చెందిన ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో నకిలీ సాధువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అయోధ్య సాధువులు చెబుతున్నారు. ‘సాధువులకున్న ఇమేజ్‌ను దిగజార్చకూడదు. రామాయణంలో కూడా రావణుడు సాధువు వేషంలోనే వచ్చి సీతమ్మను అపహరించాడు’ అని మరో ఆలయ పూజారి మహంత్ పరమహంస్ రామచంద్ర దాస్ తెలిపారు. హిందూ సంప్రదాయంలో సాధువులంటే ఓ గౌరవం ఉందని, ఆ విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.మరోవైపు పోలీసులు సైతం తమ చర్యలతో నకలీ సాధువుల ఆటకడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘అయోధ్య చాలా సున్నితమైన నగరం. ఏ చిన్న సంఘటన జరిగితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. అయోధ్యలోని అన్ని ఆలయాలు, ఇళ్లు చాలా పాతవి. నగరంలోని అన్ని ఇళ్లూ, ఆలయాలు తనిఖీ చేస్తున్నాం. గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది’ అని పోలీస్ సర్కిల్ ఆఫీసర్ రాజు కుమార్ సాబ్ మీడియాకు తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాగానే ‘డాటాబేస్’ రూపొందిస్తామని, ఇందువల్ల భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరిగినా నిందితుల జాడ వేగంగా పసిగట్టగలుగుతామని ఆయన చెప్పారు.