సామూహిక ఆత్మహత్యల కేసులో కొత్త మలుపు. కీలక రహస్యాలు చెప్పిన రెండు రిజిస్టర్లు.

ఢిల్లీ ;
దేశ రాజధాని ఢిల్లీలోని స్థానిక బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతులై కనిపించారు. 24 గంటల తర్వాత కూడా ఈ మరణాల వెనుక రహస్యాన్ని కనిపెట్టలేకపోతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిని ఏ కోణంలో దర్యాప్తు చేయాలనే సందిగ్ధంలో పడ్డారు. ఇవి సామూహిక ఆత్మహత్యలా లేక ఎవరైనా బయటి వ్యక్తి వీళ్లందరిని హత్య చేశాడా అనే అనుమానాలకు జవాబులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. మృతుల బంధుమిత్రుల ఒత్తిడి మేరకు ఢిల్లీ పోలీసులు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే మృతుల దగ్గర దొరికిన నోట్స్ ప్రకారం వీరు ఆధ్మాత్మిక, క్షుద్ర పూజలు, మంత్రతంత్రాల వంటి రహస్య తతంగాలు జరిపేవారని తెలుస్తోంది. ఇంట్లో సోదాలు జరుపుతున్న పోలీసులకు ఇలాంటి నోట్స్ కొన్ని దొరికాయి. వీటిలో మరణం, మంత్రతంత్రాల ప్రస్తావన ఉంది. ఈ కుటుంబం మోక్షం సాధించేందుకు రకరకాల పూజలు చేసేవారని తెలిసింది.
ఆధ్యాత్మికత, మంత్రతంత్రాలు నమ్మేవారు;
మరణించిన భాటియా కుటుంబం ఇంట్లో దొరికిన సాక్ష్యాల ప్రకారం వీళ్లకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేది. కుటుంబంలో 11 మంది ప్రతి నియమం, వ్రతం కలిసికట్టుగా చేస్తారు. రోజూ రాత్రి భజన చేసి కానీ నిద్రించేవాళ్లు కారని పొరుగువారు చెబుతున్నారు. నారాయణదేవి చిన్నకొడుకు లలిత్ ఐదేళ్లుగా మౌన వ్రతం చేస్తున్నట్టు తెలిసింది. అంతే కాదు.. క్షుద్ర విద్యలపై కూడా వీరికి అపారమైన నమ్మకం. మోక్షం సాధించాలనే అంధ విశ్వాసంతో అంతా మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. 10 శవాలు వేలాడుతూ కనిపించిన చోట పోలీసులకు రెండు రిజిస్టర్లు లభించాయి. వీటిలో చాలా పేజీల్లో చేతిరాతతో ఏవేవో రాసి ఉన్నాయి. కొన్ని పుటలు ఖాళీగా వదిలేశారు. ఈ చేతిరాతను బట్టి ఇది ఎవరు రాశారో కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
రిజిస్టర్ లో ఏం రాసి ఉంది?
‘రాత్రి ఒంటి గంట తర్వాత జపం ప్రారంభించండి. చనిపోయే ముందు మీ కళ్లని బట్టతో గట్టిగా కట్టుకోండి. నోట్లో దూది కుక్కుకోండి. చనిపోయేటపుడు గాభరా వేస్తుంది. అందుకని మీ చేతులను అదుపులో ఉంచుకొనేందుకు తాళ్లతో కట్టేసుకోండి. ఈ పనిని శనివారం లేదా గురువారం చేయడం మంచిది‘ అని ఆ రిజిస్టర్ లో రాసి ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం. రిజిస్టర్ లో రాసి ఉన్న వివరాలను బట్టి మృత్యువు, మోక్షం అనే భ్రమలతో ఈ 11 మంది మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ రిజిస్టర్ లో ఎక్కడా ఏ ఆధ్యాత్మిక గురువు పేరు కనిపించలేదు. కానీ ఎలా చనిపోవాలో తెలుపుతూ ఓ పెద్ద అధ్యాయమే రాసి ఉంది. చనిపోయిన వారిలో ఇది ఎవరి హ్యాండ్ రైటింగో కనిపెట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చనిపోయే ముందు మత్తుమందు తిన్నారు. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీళ్లలో ఇద్దరు చిన్నపిల్లలు. ఒక మహిళ శవం షాండ్లియర్ కు వేలాడుతూ కనిపించింది. మిగిలిన 9 మంది శవాలు పైకప్పు మీద ఇనుప గ్రిల్ కు చున్నీలు, చీరలతో ఉరేసుకున్నారు. కుటుంబ పెద్ద అయిన నారాయణదేవి శవం నేలపై పడి ఉంది. వీళ్లలో 9 మంది చేతులు రిజిస్టర్ లో రాసి ఉన్నట్టు కళ్లపై గుడ్డతో కట్టి నోట్లో దూది కుక్కి చేతులు తాళ్లతో కట్టి ఉన్నాయి. చిన్న కుమారుడు లలిత్, అతని భార్య టీనా చేతులు కట్టి లేవు. దీనిని బట్టి చనిపోయే ముందు వాళ్లిద్దరూ తప్ప మిగిలినవాళ్లు ఏదో మత్తుమందు తిని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు కళ్లపై గుడ్డ కట్టి నోట్లో దూది కుక్కి టేప్ వేసి ఉరి తీసి ఉంటారని భావిస్తున్నారు. చివరగా వాళ్లిద్దరూ ఉరి పోసుకుని ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతుల బంధువుల అనుమానం మేరకు బురారీ పోలీసులు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వీరిని సామూహికంగా హత్య చేసినట్టు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లోక్ నాయక్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఆరు శవాల పోస్ట్ మార్టం పూర్తయింది. దీని ప్రకారం మరణానికి కారణం ఆత్మహత్యేనని డాక్టర్లు తెలిపినట్టు తెలిసింది. ఉరి పోసుకుని మరణించినట్టు స్పష్టమైనట్టు సమాచారం. అన్ని శవాలు పోస్ట్ మార్టం పూర్తయ్యాక డాక్టర్లు తమ నివేదికను పోలీసులకు అందజేయనున్నారు.