సిఎం. రమేశ్ ‘ ఉక్కు’ దీక్ష విరమణ.

కడప;
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలనే డిమాండ్‌తో టీడీపీ రాజ్యస‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌ చేప‌ట్టిన ఆమ‌ర‌ణ‌ దీక్ష ముగిసింది. పదకొండో రోజున టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా నిమ్మరసం అందుకొని ఎంపీ తన దీక్ష చాలించారు. దీక్షలో కూర్చొనే ముందు కడపకు కర్మాగారం సాధించే వరకు ప్రాణాలు పోయినా దీక్ష విరమించనని రమేష్ ప్రకటించారు. దీక్షా వేదిక‌ నుంచి టీడీపీ ప్రధాన నేతలంతా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. సొంత జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేస్తున్న దీక్షకు వైసీపీ అధినేత జగన్ కలిసి రావడం లేదని తూర్పారబట్టారు. రాష్ర్టానికి ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ దోస్తీ చేస్తోందని విమ‌ర్శలు గుప్పించారు. ఇంకేముంది.. నిజంగానే రమేష్ ఆమరణ దీక్ష చేస్తారు, దాంతో దెబ్బకి కేంద్రం దిగిరానుందనే అభిప్రాయం కలిగేంత బిల్డప్ ఇచ్చారు. కానీ ఉక్కు ఫ్యాక్టరీ కేటాయిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటనేదీ రాలేదు. రమేష్ తను అనుకున్న లక్ష్యం సాధించకుండానే దీక్షకు స్వస్తి పలికారు. ఈ మాత్రం దానికి ఇన్ని రోజులు దీక్ష ఎందుకు చేశారు? చేసి ఏం సాధించారు? ఇది ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న.నాలుగేళ్లు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కలిసి అధికారం పంచుకున్నపుడు కడప ఉక్కు గుర్తుకు రాలేదా అనేది ఇప్పుడు రాష్ట్రప్రజల సందేహం. నిజంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటే లక్ష్యం అయితే స్థాపనకు తాను సిద్ధం అంటున్న గాలి జనార్దనరెడ్డికి అనుమతిస్తే సరిపోతుంది. పెట్టుబడులు, పరిశ్రమల కోసం దేశవిదేశాలు తిరిగి బతిమాలి తెచ్చుకుంటున్న ప్రభుత్వం.. మిగతా రంగాల మాదిరిగా ఉక్కు కూడా గాలికే అప్పజెపితే ఉక్కు పరిశ్రమ, స్థానికంగా ఉపాధి రెండూ నెరవేరతాయి. దీక్ష చేస్తున్న ఎంపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ అధినేతతో అనుమతులు మంజూరు చేయించుకొస్తే సరిపోయేది. కానీ అలా జరగలేదు. ఇక్కడ లక్ష్యం ఇంకేదో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓ వైపు ప్రజాసంకల్ప యాత్రతో జగన్, మరోవైపు జనసేనాని కవాతులను ఎదుర్కొనేందుకు అధికార టీడీపీ వేసిన స్కెచ్చే ఈ ‘ఉక్కు దీక్ష’ అని భావించవచ్చు. ఎన్నికల నేపథ్యంలో, బీజేపీతో తెగతెంపులవడంతో టీడీపీ కడప ఉక్కు పేరుతో రాయలసీమలో సెంటిమెంట్ రగిల్చి కాస్త అనుకూల పరిస్థితి తెచ్చుకోవాలని చూస్తోంది. ఇలాంటి ఉక్కు దీక్షలు తుక్కు దీక్షలు అని ఆరోగ్యం పాడుచేసుకోవద్దని దీక్ష ప్రారంభమైన మూడో రోజునే మరో టీడీపీ ఎంపీ జే.సీ.దివాకర్ రెడ్డి అదే వేదిక నుంచి సీఎం రమేష్ కి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొండివాడని.. చివరికి అమరజీవివైనా కరుణించడని కుండబద్దలు కొట్టారు. జేసీ పాటి అవ‌గాహ‌న‌, ఆలోచ‌న సీఎం ర‌మేష్‌, 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు లేవని కాదు. వారిద్దరూ అంత అమాయకులూ కారు. అసలు పార్టీలోనే ఈ దీక్షపై సెటైర్లు పడటం ఇంకో హైలైట్. సాక్షాత్తూ టీడీపీ ఎంపీలు ఎంత సీరియస్ గా ఉన్నారో ఇటీవల బయటపడ్డ ఒక వీడియో క్లిప్పింగ్ పట్టిచ్చింది. అంటే ఇక్కడ అసలు ఈ దీక్ష ప్రారంభం, అంతం అన్నీ ముందుగా ప్లాన్ చేసినట్టు సాగాయి. ఎనిమిదో రోజు బీటెక్ రవిని ఆస్పత్రికి తరలించి బలవంతంగా దీక్ష భంగం చేయడం మరో మూడు రోజులకే సీఎం రమేష్ కి సాక్షాత్తూ చంద్రబాబు దీక్షా వేదికపై నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం చూస్తే ఇది ఆమరణ దీక్ష కాదనే విషయం స్పష్టం అవుతుంది. ఇందులో చెప్పుకోవాల్సిన మరో ట్విస్ట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు సుముఖంగా వున్నామని..మెకాన్‌ సంస్థకి తెలుగు రాష్ట్రాలు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వాల్సి ఉందని ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ చెప్పడం. అంటే బంతి రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనే ఉంది. అధికార టీడీపీ ప్రభుత్వం వేగంగా కదిలి ఆ సమాచారం ఇస్తే అప్పుడు తప్పు కేంద్రానిది అవుతుంది. కానీ అలా చేయరు. ఇవేవీ తెలియని అమాయక ప్రజలకు మాకు చేయాలనే ఉంది కానీ కేంద్రం పడనివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు.రాజకీయ పార్టీగా టీడీపీ వ్యూహాలు రచించడంలో తప్పే లేదు. విపక్షాలను ఎదుర్కొనేందుకు తప్పనిసరిగా చేయాల్సిందే. కానీ అధికార పార్టీ దీక్షలు చేయడం కొంచెం మింగుడు పడని విషయం. ఇన్నాళ్లూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే అలా చేసేవారు. ఇప్పుడు టీడీపీ ప్రజాధనంతో ధర్మపోరాట దీక్షలు, ఉక్కు దీక్షలు వంటివి చేపడితే జనం మెచ్చరు. అందులోనూ ముఖ్యంగా తమ రాజకీయ లబ్ధి కోసం గతంలో కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నపుడు వీసమెత్తు ప్రయత్నమైనా చేయకుండా ఇప్పుడు హఠాత్తుగా ఆమరణ దీక్షలకు కూర్చుంటే అది కచ్చితంగా పొలిటికల్ దీక్ష అనిపించుకుంటుంది. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సిన ప్రభుత్వాలు వారి దృష్టి మరల్చేందుకు స్థానిక భావోద్వేగాలతో ఆడుకోవడం తప్పకుండా ఖండించాల్సిందే.