సికిందరాబాద్ లోక్ సభకు దానం.

ఎస్.కె. జకీర్.
కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు దానం నాగేందర్ సికిందరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి గా బరిలోకి దిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ హామీ లభించిన తర్వాతే ఆయన పార్టీ ఫిరాయించినట్టు సమాచారం. టిఆర్ఎస్ తనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని దానం నాగేందర్ మీడియాలో శుక్రవారం చెప్పిన మాటలు ఎవరూ నమ్మడం లేదు. టిఆర్ఎస్ లో తన చేరిక గురించి ఆయన నేరుగా ప్రకటన చేయకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తిన తీరు ఆయన భవిష్యత్తు కార్యాచరణను తెలియజేస్తున్నది. ఆత్మగౌరవం దెబ్బతిన్నందుకు, బి.సి.లకు కాంగ్రెస్ లో తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వనందుకు ఆ పార్టీ తో తెగతెంపులు చేసుకుంటున్నట్టు దానం తన రాజీనామా వ్యవహారాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో నాయకులకు, ముఖ్యంగా బి.సి.లకు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తున్నదో ,అధికార పార్టీలోని నాయకులకు లభిస్తున్న ‘ఆత్మగౌరవం’ ఏమిటో టిఆర్ఎస్ లో చేరిన వారికి తెలుసు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం ఒక్క రోజులో జరిగిన పనిగాదు. దాదాపు రెండేళ్లుగా ఆయన ఈ ప్రయత్నాల్లో ఉన్న సంగతి కాంగ్రెస్ నాయకులకు తెలియనిది గాదు. ఎలాంటీ కండిషన్లు లేకుండా టిఆర్ఎస్ లో చేరాలని దానం కు కేసీఆర్ సూచించారని గతంలో వార్తలు వెలువడ్డాయి. మొత్తమ్మీద వివిధ కారణాల వల్ల ఆయన చేరిక వాయిదా పడినట్టు భావించవలసి వస్తున్నది. లోక్ సభ కు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకుంటున్నందున సికిందరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థి కోసం కేసీఆర్ అన్వేషణ జరుపుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ను సికిందరాబాద్ నుంచి లోక్ సభకు పంపించాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అభిప్రాయపడుతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతున్నది. అయితే ఇప్పుడు దానం నాగేందర్ ను ఆ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపాలని కేసీఆర్ దాదాపు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేయడానికి గల కారణాలను దానం నాగేందర్ మీడియాకు వివరిస్తున్నపుడు ఈ ప్రక్రియ అంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో నెలకొంది. మీడియా కాన్ఫరెన్సు లో ఏమి మాట్లాడాలి? సి.ఎం. కేసీఆర్ ను ఎట్లా ప్రశంసించాలి?బిసిల అంశాన్ని ఎట్లా ప్రస్తావించాలి? కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని ఎట్లా అప్రదిష్ట పాల్జేయాలి? వంటి అంశాలన్నిటినీ ‘ఒక డిజైను’ ప్రకారమే దానం లేవనెత్తారని అనుకుంటున్నారు. కాంగ్రెస్ లో ‘ముఖ్యమంత్రి’ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉన్న సంగతి, ఎవరినైనా సి.ఎం. అభ్యర్థిగా ప్రకటిస్తే మిగతా ‘ ముఖ్యమంత్రి’ అభ్యర్థులు వెంటనే పార్టీ విడిచిపెడతారని కూడా నాగేందర్ అన్నారు.