సినిమాలకు ‘నో ‘ చెప్పిన సంజయ్ దత్ కూతురు త్రిశాల దత్.

ముంబయ్:
ఖల్ నాయక్ సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు‘ ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తోంది. విమర్శలు, ప్రశంసలతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాలో దత్ మొదటి భార్య రిచా శర్మ, కూతురు త్రిశాలని చూపకపోవడంపై పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే తమ గురించి ప్రస్తావన లేకపోవడాన్ని త్రిశాల చాలా లైట్ తీసుకుంది. అసలు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదని కుండబద్దలు కొట్టింది. ఫ్యాన్స్ తో మనసు విప్పి మాట్లాడేందుకు సెలిబ్రిటీలు ఈ మధ్య ప్రముఖ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో కొత్తగా వచ్చిన ‘ఆస్క్ మి ఎనీ కొశ్చెన్‘ ఫీచర్ ని విరివిగా వాడుకుంటున్నారు. అదే కోవలో సంజయ్ దత్ కూతురు త్రిశాల కూడా ఇన్ స్టాలో తన ఫాలోవర్లు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇచ్చింది. తండ్రితో తన సంబంధాలు బాగున్నాయని.. దత్ కూడా తనతో మిగతా తండ్రుల్లాగే గారాబం చేస్తాడని చెప్పింది. ఆయన తన సెన్సాఫ్ హ్యూమర్ తో ఎంతో నవ్విస్తాడని తెలిపింది.
తనకు తల్లిదండ్రుల ఇద్దరి లక్షణాలు వచ్చాయని చెప్పింది త్రిశాల. తనకు తండ్రిలాగే టెంపర్ ఎక్కువని, తొందరగా సహనం కోల్పోతానని తెలిపింది. అయితే అందరితో ప్రేమగా వ్యవహరించడం, దయ చూపడం వంటి లక్షణాలు తల్లి నుంచి వచ్చాయని తెలిపింది. ఇద్దరిలోని దానగుణం తనలోనూ ఉందంది. ఊహ తెలిసినప్పటి నుంచి తల్లిదండ్రులతో కలిసి లేనందువల్ల వాళ్లను మిస్సవ్వలేదని చెప్పింది. అమెరికాలోని హోఫ్ స్ట్రా యూనివర్సిటీ నుంచి సైకాలజీలో మాస్టర్స్ పట్టా పొందిన త్రిశాల, బాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే ‘నో థ్యాంక్స్‘ అని చెబుతానని స్పష్టం చేసింది.