సిరిసిల్ల భూకబ్జాపై కదలని విచారణ. తలపట్టుకున్న కేటిఆర్.

ఎస్.కె.జకీర్.
తమ పార్టీకి చెందిన మునిసిపల్ వైస్ చైర్మన్ భూకబ్జా ఆరోపణలపై విచారణకు మంత్రి కేటిఆర్ఆదేశించినా, విచారణ ఇంకా పూర్తి కాలేదు. దోషులు తేలలేదు. రెవెన్యూ అధికారులు ఎంత నత్త నడకగా విచారణ జరుపుతున్నారో అర్ధం చేసుకోవచ్చును. బీవై నగర్‌కు చెందిన మంగాళరపు సువర్ణ అనే మహిళకు సంబంధించిన భూమిని తన అనుచరుడి భార్య పేరిట సిరిసిల్ల మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ తవుటు కనకయ్య దొంగపట్టా చేయించి కబ్జా చేశాడన్నదిఆరోపణ. దీని పై వారం రోజులుగా మీడియాలో కథనాలను ప్రసారం అయ్యాయి. మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించారు. ట్విట్టర్ ద్వారా సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ను విచారణకు ఆదేశించారు. కృష్ణభాస్కర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. అధికారపార్టీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తవుటు కనకయ్య, ఆయన అనుచరుల ఒత్తిడి వల్ల ఎంక్వైరీ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దాంతో తనకిక న్యాయం మరింత జరగదని నిర్ధారించుకున్న సువర్ణ సోమవారం కలెక్టరేట్‌ ముందు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పలువురు స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. “నేను కనకయ్య ఇంటికెళ్లితే మంత్రి కేటీఆర్‌కు చెప్పుకుంటావా ఎవ్వరికిచెప్పుకుంటావో చెప్పుకో పో’’అంటూ తనను మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కనకయ్య గెంటేశాడని సువర్ణ కలెక్టరేట్‌ ముందే కన్నీటి పర్యంతమైంది. నకిలీ పట్టాలతో తన భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించింది. సువర్ణ ఆందోళన కలెక్టరేట్‌ ముందు కొనసాగుతున్న సమయంలో మంత్రికేటీఆర్ ‘క్యాంప్ఆఫీసు’లో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తవుటు కనకయ్య ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. మీడియాలో తనపై వస్తున్న కథనాలు అవాస్తవమంటూ ఖండించారు. ఆమె భూమిని తామెవరమూ కబ్జా చేయలేదనీ, అది తన అనుచరుడి భార్య పేరిటే ఉందని, సువర్ణ తమను అనవసరంగా అప్రదిష్టపాల్జేస్తున్నట్టు కనకయ్య ఆరోపించారు. మంగాళరపు సువర్ణ అనే బాధితురాలు తన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ, విలపిస్తూ ఏకంగా ఆత్మహత్యా యత్నానికే ఒడిగడితే, తనభూమేననిమున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కనకయ్య అంటున్నారు. కనకయ్య అనుచరుడి భార్య పేరిట ఉన్న డాక్యుమెంట్‌ 2012 సంవత్సరంలో పట్టా అయినట్టు కనిపిస్తున్నది. తాను ఆ పట్టా చేయలేదనీ అప్పటి సిరిసిల్ల ఎమ్మార్వో జయచంద్రారెడ్డి స్పష్టం చేయడం ఒక మలుపు. తన హయాంలో కేవలం సారంపల్లిటెక్స్‌టైల్‌ పార్క్‌ వద్ద మాత్రమే పట్టాలు చేశానని ఆయన చెప్పారు. అవసరమైతే కోర్టుకు వచ్చి సాక్షం చెప్పడానికి కూడా తాను సిద్ధమేనన్నారు. దీంతో… బాధిత మహిళ సువర్ణ చెబుతున్నదేముమ్మాటికీ నిజమనిపిస్తోంది. కేటీఆర్‌ తననియోజకవర్గంలో కొనసాగుతున్న ఈభూకబ్జా వివాదంతో తలపట్టుకునే పరిస్థితి వస్తున్నది. విచారణపై కమ్ముకున్న నీలినీడలు, మరోవైపు మంత్రి ఇంట్లోనే మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తవుటు కనకయ్య ప్రెస్‌మీట్‌ పెట్టడం, కలెక్టరేట్‌ ఎదురుగా సువర్ణ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి కన్నీరుపెట్టడంవంటిఘటనలు సిరిసిల్ల ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి.