సి.ఎం.గా.మరోసారి అమ్మవారిని దర్శించుకుంటా. – కేసీఆర్.

విజయవాడ:
2019 ఎన్నికల తర్వాత సీఎంగా మరోసారి విజయవాడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మంత్రి దేవినేని, కేసీఆర్‌ మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు మొక్కులో భాగంగా విజయవాడ దుర్గమ్మ అమ్మవారికి ముక్కుపుడక సమర్పించుకొనేందుకు బెజవాడకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తెలంగాణ కోసం మీరు.. సమైక్యాంధ్ర కోసం తాను ఆమరణ దీక్షచేసినట్టు దేవినేని కేసీఆర్‌కు గుర్తు చేశారు. రాష్ట్ర విడిపోయి తెలంగాణకు మీరు సీఎం అయితే.. ఏపీలో తాను మంత్రినయ్యానని అన్నారు. దేవినేని వ్యాఖ్యలపై స్పందించిన కేసీఆర్‌.. ప్రజాస్వామ్యం గొప్పదనం అదేనని బదులిచ్చారు. విజయవాడ ప్రస్తుతం చాలా బాగుందంటూ కేసీఆర్‌ కితాబిచ్చారు. బందరు రోడ్డును బాగా విస్తరించారన్నారు. రోడ్డుకు ఇరువైపులా వేయించిన పెయింటింగులు చాలా బాగున్నాయని, గన్నవరం విమానాశ్రయం వరకు పచ్చదనం ఆహ్లాదాన్ని కల్గించేదిగా ఉందని దేవినేనితో అన్నారు. గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ ఏర్పాటు కూడా బాగుందన్న ముఖ్యమంత్రి.. కనకదుర్గమ్మ దర్శనం బాగా జరిగిందని చెప్పారు. తనకు పర్యటన ఏర్పాట్లు చేసిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.