సోనియా పై కేటీఆర్ వ్యాఖ్యల వెనుక….. !!

  • ఆత్మ విశ్వాసమా? అతి విశ్వాసమా?         

ఎస్.కె.జకీర్.
‘తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మా ఇవ్వలేదు, బొమ్మా ఇవ్వలేదు’ అని మంత్రి కేటీఆర్ శుక్రవారం తెలంగాణ భవన్ లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నవి. ‘ కేసీఆర్ కృషితో పాటు, ప్రత్యేక రాష్ట్రం కోసం వందలాది మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ద్రోహం చేసింది.’ అని కూడా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌ పై నిప్పులుచెరిగారు. ‘ అరవై ఏండ్లు తెలంగాణ గోస పెట్టిన పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ దే. తెలంగాణను కొందరి కుట్రలకు బలి చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రకు అప్పట్లో బలవంతపు పెళ్లి చేసింది. ఎన్నికల కాలం వచ్చందంటే గాలి మాటలు వినిపిస్తుంటాయి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ, ప్రజలను మభ్యపెడతారు. అలాంటి నాయకులే మళ్లీ మీ వద్దకు వచ్చి,ఇంటింటికీ తులం బంగారం ఇస్తామని కూడా చెబుతారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలలి’. అని కేటీఆర్ హెచ్చరించారు. ‘మరో 15 ఏళ్ల పాటు తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. అయితే, అందరం కలిసి ఇప్పుడే కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేద్దాం’. అని ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలు రావచ్చుననుకుంటున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై ఇంతకుముందు కంటే దుకుడుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ, దయ వల్ల వచ్చిందని తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన బహిరంగ ప్రకటనలు, వ్యాఖ్యలను మొత్తంగా ఉపసంహరించుకున్నట్టు భావించాలా?లేక ఎన్నికల వేళ ప్రధానప్రతిపక్షం పై ఈ మాత్రం ‘డోసు’ తప్పదని అభిప్రాయానికి రావాలో తెలియడం లేదు. ‘ సోనియాగాంధీ చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎలాంటి సందేహమూ అవసరం లేదు. అయాం ఆన్ రికార్డ్. ఎన్.డి.టి.వి.వాళ్లకు కుండబద్దలు కొట్టినట్టు ఇదే చెప్పిన. కొత్తగా కొలువు దీరిన తెలంగాణ శాసనసభలో సభా నాయకునిగా, ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సోనియా గారి చొరవ వల్ల రాష్ట్రం ఏర్పడింది. ఎవరికీ డౌట్ వద్దు. అయామ్ వన్స్ అగైన్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్లి ఇన్ ద ఫస్ట్ సెషన్స్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ’ అని కేసీఆర్ 2014 జూన్ 13 న అన్నారు. బీజేపీ నాయకుడు, కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా అయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీకి కృతజ్ఞతలు ప్రకటించడం తెలంగాణ సంస్కారం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో వినయంగా చెప్పుకున్నారు. అయితే తాజాగా తన కుమారుడు, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో కేసీఆర్ కూడా ఏకీభవిస్తున్నట్టా? ఏకీభవించడం లేదా? అన్నది తెలియవలసి ఉన్నది. రాజకీయాల్లో పరస్పరం దూషించుకోవడం పార్టీల నాయకులకు లవాటైన పనే. కొత్త విషయమేమీ కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక ‘ అమ్మా లేదు, బొమ్మా లేదు.’ వ్యంగాస్త్రాలతో కేటీఆర్ విరుచుకు పడడం ఏమి సూచిస్తున్నది. టిఆర్ఎస్ మళ్లీ విజయడంకా మోగిస్తుందన్న ఆత్మవిశ్వాసమా? లేక అతి విశ్వాసమా ? అసహనమా? కాంగ్రెస్ నాయకులకు సోనియాగాంధి సెంటిమెంటు బలం ఉన్నది.ఆమె వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందనే ప్రచారానికి వారు ఇంకా పదును బెట్టే అవకాశాలు లేకపోలేదు. కేసీఆర్ ఆమోద ముద్ర తోనే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చును. లేదా తానే స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలకు పూనుకొని ఉండవచ్చును. అయితే టిఆర్ఎస్ నాయకులు సోనియాగాంధీపై ఎప్పుడు, ఎలాంటి నిందలు వేసినా, సెటైర్లు సంధించినా అవి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతుల్లోకి ‘ అస్త్రాలు’ గా మారే ‘ ప్రమాదాన్ని’ పసిగట్టడం లో అధికారపక్షం విఫలమవుతున్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
‘‘కేసీఆర్‌ కళ్లు నెత్తికెక్కాయి. అందుకే అహంకారంతో, అడ్డగోలుగా, అబద్ధపు మాటలుమాట్లాడుతున్నారు. అధికారం కోల్పోతామనే భయంతో దిగజారుడుతనంతో సిగ్గు, లజ్జలేని మాటలు మాట్లాడుతున్నారు. మనిషి నిండా అహంకారం, అసహనం, బెదిరింపు ధోరణి. సీఎం స్థాయికి తగ్గ వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఒక రాజనీతిజ్ఞుడు వస్తారనుకుంటే చిల్లర రాజకీయాలు చేసే, చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తి వచ్చాడు’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు అన్నారు. ‘సోనియా కాళ్లు మొక్కింది మీరే కదా? తెలంగాణ వస్తేనే కదా సీఎం కుర్చీలో కూర్చున్నది? ప్రజలను కలవని సీఎంవు నువ్వు ఒక్కడివే. ప్రజా ప్రతినిధులనూ కలవడంలేదు. అందుకే సొంత పార్టీవారే కోపంతో రగిలిపోతున్నారు.’ అని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివిధ సందర్భాలలో గుర్తు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యల తీవ్రతను బట్టి ఎన్నికలు త్వరలోనే రావచ్చును. అలాగే తమకు కాంగ్రెస్ తోనే ప్రధానంగా పోటీ ఉంటుందని కూడా ఈ వ్యాఖ్యలు తెలియజేస్తున్నవి. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శల ‘డోసు’ క్రమంగా పెరగవచ్చును.