‘సోమారపు’ సన్యాసం. ‘కంచుకోట’లో ‘కార్’ చిచ్చు.

ఎస్.కె.జకీర్.
తెలంగాణ రాష్ట్ర సమితి కంచుకోట ఉమ్మడి కరీంనగర్ లో ‘అవిశ్వాసపు’ మంటలు చెలరేగుతున్నవి. మునిసిపల్ మేయర్లు, చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులపై అవిశ్వాస రాజకీయం ఆ జిల్లా నుంచే ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ‘అవిశ్వాస’ తీర్మానాలు వద్దని మంత్రి కేటీఆర్ వారించినా కింది స్థాయిలో ఎవరూ వినే పరిస్థితులు కానరావడం లేదు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై శాసనసభ్యులకు ‘పట్టు’ లేదు. శాసన సభ్యులకు, మంత్రులకు మధ్య ‘సమన్వయ లేమి’ రామగుండం ఎపిసోడ్ తో బట్టబయలైంది. బెల్లంపల్లి, వేములవాడ, హుజూరాబాద్ వంటి పురపాలక సంఘాలలోనూ ఇదే ‘సీన్’. వేములవాడ శాసనసభ్యుడు రమేశ్ చెన్నమనేని మాటలను కౌన్సిలర్లు లెఖ్ఖ చేయడం లేదు. వేములవాడ మునిసిపల్ చైర్మన్ పై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానపత్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులకు అందజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, జగిత్యాల జిల్లా వరకు ఎం.పి. కవిత శాసిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పార్టీ ‘స్థానిక’ నాయకత్వం, క్యాడర్, రెండవ శ్రేణి నాయకులు ఈ ముగ్గురిని సైతం ‘ఖాతరు చేయని’ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉన్నది. క్రమశిక్షణా రాహిత్యం ఎందుకు పెరుగుతున్నదో అధ్యయనం చేయవలసి ఉన్నది.ఇప్పుడు ‘చిరుగాలే’ నెమ్మదిగా తుపాను గాలులుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఆర్టీసీ చైర్మన్ ‘ఆఫ్ ద రికార్డు’ పేరిట, చిట్ చాట్ పేరిట చెబుతున్న మాటలు నిజమైతే వాటిని లోతుగా చరించక తప్పదు. ‘పార్టీలో గౌరవం’ లేదన్నది ఒక ఆరోపణ.గౌరవం ఆయనకొక్కడికే లేదా?ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా ఈ అభిప్రాయంతో ఉన్నారా? ‘అవినీతిని ప్రోత్సహిస్తూన్నారు’ అన్నది మరో ఆరోపణ. అవినీతికి ఎవరు పాల్పడుతున్నారు! ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కేసీఆర్ నోటీసుకు సోమారపు సత్యనారాయణ తీసుకు వెళ్ళారా? సి.ఎం. ఎలా స్పందించారు? రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయనుకుంటే ఆయనపై ఎమ్మెల్యే కేటీఆర్ కు ఫిర్యాదు చేశారా?కేటీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదా ? శాససభ్యులుగా ‘ప్రజల్లో పాసుమార్కులు’ రాని వారు…. అంటూ ఒక ముప్ఫయి ఐదు మంది జాబితా ఇటీవల మీడియాలో హల చల్ చేసింది. ఆ ‘జాబితా’ లో రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా ఉన్నారు. అసలు అలాంటి జాబితాకు విశ్వసనీయతలేదని టిఆర్ఎస్ ప్రముఖులెవ్వరూ ఖండించకపోవడం ఒక ట్విస్టు. ఇందులో కొంతమంది ఇతరపార్టీల్లో చేరడానికి దాదాపు సరంజామా ‘సిద్ధం’ చేసుకుంటున్నట్టు కొన్ని వదంతులు రాజ్యమేలుతున్నవి. ఈ వదంతులలో నిజం ఉండవచ్చును. బూటకమూ కావచ్చును.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు రామగుండం ఎంఎల్ఎ, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ సోమవారం ‘అసమ్మతి బాంబు’ పేల్చారు. ఆయన ప్రకటన వెనుక కేటీఆర్ ‘ఒత్తిడి రాజకీయం’ ఉన్నట్టు పార్టీలో చర్చ సాగుతున్నది.నాలుగు సంవత్సరాల అవిశ్వసాస తీర్మాన గడువు గత నెలలో ముగియడంతో మేయర్‌పై కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. నేడో రేపో అవిశ్వాస తీర్మానం అమలులోకి రావలసి ఉండగా అధిష్టానం ఆదేశాల మేరకు నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకువచ్చారని తెలుస్తున్నది.అధిష్టానం నుంచి ఒత్తిళ్లు ఏర్పడుతున్న నేపథ్యంలో తాను ఇక పార్టీలో కొనసాగలేనని సోమారపు సత్యనారాయణ అంటున్నారు. తాజా పరిణామాలపై మంత్రి ఈటెలతో మాజీ ఎంపీ వివేక్‌ సమావేశమయ్యారు. ”నేను రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా. ఏ పార్టీ లోకి వెళ్లను.కొంతమంది అభివృద్ధి ని అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయను. అభివృద్ధికి సహకారం లభించకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకొక తప్పడం లేదు. రామగుండం కార్పొరేటర్లు నా మాట వినడం లేదు. మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి బెదిరించినంత పని చేసాడు… బెదిరింపులు భరించడం నాతో కాదు. నేను ఎంత మొండిగా ఉంటానో కేసీఆర్ కు తెలుసు.ఈ రోజు నుండి నేను ఎలాంటి కార్యక్రమాలకు హాజరు కాను. పార్టీ కార్యాలయానికి కూడా రాను. ఇలాంటి రాజకీయాలు నాతో కావు.కేటీఆర్ కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నా. అందుకే పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చా. టీఆర్‌ఎస్‌లో నాకు గౌరవం లేదు. పార్టీలో అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చినా అధికారాలు ఇవ్వలేదు. పార్టీలో క్రమశిక్షణ లోపించింది . పదవుల్లో ఉంటా… కానీ విధులకు హాజరుకాను”. సోమవారం ఉదయం సింగరేణి కార్మికులతో భేటీ అయినపుడు ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అచ్చేసిన వ్యాఖ్యలివి. రామగుండం మేయర్‌ అవిశ్వాసతీర్మానం నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన సింగరేణి కార్మికులు, రామగుండం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి గత నెలతో నాలుగు సంవత్సరాల గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా మున్సిపాలిటీలో, అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో ‘వర్గ పోరు’ ఎక్కువగా కొనసాగుతోంది. మున్సిపాలిటీలో అధికారపార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్‌లపై, అధికార పార్టీ కార్పొరేటర్‌లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. రామగుండం మున్సిపాలిటీలో వర్గ పోరు ఇటు టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇండిపెండెట్ అభ్యర్థి లక్ష్మీనారాయణను అధిష్టానం మేయర్‌గా నియమించింది. అయితే మేయర్ వ్యవహారశైలిని మొదటి నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే తప్పుబడుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొద్ది రోజులుగా మేయర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ వ్యవహరం మంత్రి ఈటల రాజేందర్‌ కు సంకటంగా మారింది. హుజూరాబాద్‌ మున్సిపాలిటీ కి చెందిన 17మంది పాలకవర్గం సభ్యులు అవిశ్వాస తీర్మానం కాపీని మంత్రికి అందజేశారు. హుజూరాబాద్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ సీట్‌ బీసీకి కేటాయించడంతో మంత్రి వద్దకు వెళ్లిన కౌన్సిలర్లలో బీసీ కౌన్సిలర్లు ఐదుగురు చైర్మన్‌ సీట్‌పై కన్నేసినట్లు తెలిసింది. వైస్‌చైర్‌పర్సన్‌గా ఉన్న తాళ్లపల్లి రజితతో పాటు మరో సీనియర్‌ కౌన్సిలర్లు, కౌన్సిలర్‌గా టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి దొరకకపోవడంతో ఇండిపెడెంట్‌గా గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన మంద ఉమాదేవి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చింత శ్రీనివాస్‌, భీమగోని సురేష్‌, కల్లెపల్లి రమాదేవిలు చైర్మన్‌ కావాలని ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారే మంత్రి వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూరాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న వడ్లూరి విజయ్‌కుమార్‌ రాజీనామాకు సిద్ధపడుతున్న తరుణంలో మిగతా కౌన్సిలర్లు మంత్రి మాటకు కట్టుబడి ఉంటారా లేదా అన్న అంశం పై చర్చ జరుగుతున్నది.