స్ట్రెంత్ లేదా! అయితే మూసేద్దాం!! సర్కారీ స్కూళ్ల దుస్థితి.

ఎస్.కె.జకీర్.
ప్రభుత్వ విద్యావ్యవస్థ అద్భుతంగా ఉందని, ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదంటూ ప్రభుత్వ ‘బాకా’ మీడియాలో కథనాలు వస్తున్నవి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్కూళ్లలో అది నిజం కూడా కావచ్చును. మరి ‘జీరో స్ట్రెంత్’ ఉన్నాడనే కారణంతో మూత పడుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంగతేమిటి? కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో పలు స్కూళ్లకు తాళాలు వేశారు. ఆయా ఊళ్లల్లోని జనం తమ పిల్లలకు సర్కారీ చదువు అందుబాటులో లేక, ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల పరిధిలో ఉన్న చొప్పదండి నియోజకవర్గంలో ఎనిమిది స్కూళ్లు మూతపడ్డట్టు తేలింది. కొడిమ్యాల మండలంలో మొత్తం 40 సర్కారీ పాఠశాలలు, నాలుగు ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. అందులో పోతారం, ఇందిరానగర్‌ లలో సర్కారీ స్కూళ్లను విద్యార్థులు లేరన్న సాకుతో మూసేశారు. పోతారం స్కూల్‌ను తిరుమలాపూర్‌ అప్పర్‌ ప్రైమరీ స్కూల్‌లో విలీనం చేశారు. ఇందిరానగర్‌ పాఠశాలను కొడిమ్యాల జిల్లా పరిషత్‌ స్కూల్‌లో విలీనం చేసేశారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేక, చాలీచాలని టీచర్లతో పాఠాలు చెబుతుండడంతో కొంతమంది విద్యార్థులు ప్రైవేట్‌ స్కూళ్లబాట పట్టారు. దీంతో పిల్లలు లేరన్న అదే సాకుతో, ‘సర్కారు బడి’ని మూసేయడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్యనందిస్తే, ప్రైవేట్‌ బళ్లబాట పట్టరని పేరెంట్స్ అంటున్నారు. అవి లేనప్పుడు విద్యార్థుల సంఖ్య సహజంగానే తగ్గుతుంది. అదే అదనుగా స్కూళ్లను ప్రభుత్వం మూసివేస్తున్నది. అక్కడ ఉన్న టీచర్లను డిప్యూటేషన్లపై పంపుతున్నారు. అక్కడున్న విద్యార్థులను పక్క ఊర్లోని సర్కారు పాఠశాలకు పంపిస్తున్నారు. చొప్పదండి మండలంలో 42 ప్రభుత్వ పాఠ శాలలు ఉన్నాయి. నాలుగు ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. విద్యార్థులు సరిపడే సంఖ్యలో లేరని కోనేరుపల్లిలోని సర్కారీ పాఠశాలనుమూసేశారు. రామడుగు మండలంలో 41 ప్రభుత్వ పాఠశాలలు, నాలుగు ప్రైవేట్‌ స్కూల్స్‌ ఉన్నవి. పిల్లలు లేరన్న సాకుతో గోపాల్‌రావుపేటలో మైనార్టీ ఉర్ధూ పాఠశాలను మూసేశారు. గంగాధర మండలంలో 42 గవర్నమెంట్ స్కూల్సుండగా, 13 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. సర్వారెడ్డిపల్లి, పెండలోనిపల్లి లోని రెండు సర్కారీ పాఠశాలలను మూసేశారు. సర్వారెడ్డిపల్లి, పెండలోని పల్లి పాఠశాలలను గుండి జిల్లా పరిషత్‌ పాఠశాలలో విలీనం చేసేశారు. బోయినపల్లిలో 42 ప్రభుత్వ స్కూల్స్‌ ఉండగా, రెండు ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. శాబాసుపల్లి , దున్నపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు. మొత్తం చొప్పదండి నియోజకవర్గంలో కేవలం ఒక్క మల్యాల మండలంలో మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు మూతపడలేదు. సర్కారీ స్కూల్స్‌ను బలోపేతం చేసినట్టు, గ్రామీణ విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యనందిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం తక్కువ. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొన్ని స్కూళ్లు మూతబడుతున్నవి. మరికొన్ని పాఠశాలలను విలీనం చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నవి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిత్యం దుర్వాసనలో మగ్గుతున్న పెద్దబడి ఊసు మాత్రం ఎవ్వరికీ పట్టదు. డ్రైనేజీ కంపులోనే అక్కడి ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. అదే కంపు భరిస్తూ విద్యార్థులు ఓవైపు ముక్కు మూసుకుని పాఠాలు వినాలి. పలుమార్లు మున్సిపల్ సిబ్బందికీ, అధికారులకూ విన్నవించుకున్నా, అతీగతీలేదు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ పక్కనే ఉన్న కాలనీ వాసులు చేసే మల, మూత్ర విసర్జనతో పాటు, చెత్తా చెదారం వల్ల ఈస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖానికి కర్చీఫ్ లు అడ్డుపెట్టుకొని పాఠాలు వినే పరిస్థితి పిల్లలది. కర్ఛీఫ్ అడ్డుపెట్టుకోనిదే పాఠాలు బోధించలేని దుస్థితి టీచర్లది. మున్సిపల్ కమిషనర్ కు,స్థానిక కౌన్సిలర్ కు చెప్పినా, వారు కనీసం స్కూల్ ను సందర్శించలేదని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు చెబుతున్నారు. ఒక్కొక్కసారి ఆ కాలనీ వాసులు విసిరేసే చెత్తా,చెదారం తమ విద్యార్థులపై పడుతున్నాయని కూడా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు, టీచర్లు భోజనం సమయంలో అసలు ఈ దుర్వాసనకు భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్న పరిస్థితి ఈ బడి లో నెలకొన్నది.