స్వలింగ సంపర్కంపై తేల్చని కేంద్రం.

న్యూఢిల్లీ:
స్వలింగ సంపర్కంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదు. బుధవారం సెక్షన్ 377పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గే సెక్స్ నేరమా కాదా అన్న అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సెక్షన్ 377 రద్దుపై తాము ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు విచక్షణకే వదిలేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. 2013లో సుప్రీంకోర్టు ఇదే విషయంలో ఇచ్చిన తీర్పును, ఎల్జీబీటీక్యూ వర్గానికి ఉన్న ప్రాథమిక హక్కులు, సెక్షన్ 377కు గల రాజ్యాంగ బద్ధత.. వంటి అంశాలని తాము పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ ఎఎమ్ కన్వీల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.సమాజం మారుతోందని, దాంతోపాటే విలువలు కూడా మారుతున్నాయని పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాదులు కేశవ్ సూరి, మాజీ ఏజీ ముకుల్ రోహత్గి తెలిపారు. 160 ఏళ్ల క్రితం నైతిక విలువలు అనుకున్నవి ఇప్పుడు కావని, అలాగే అప్పుడు అనైతికం అనుకున్న చాలా అంశాలు ఇప్పుడు నైతికమని చెప్పారు. ఈ తరహా ప్రజల పట్ల సమాజం ఎలా చూస్తోందన్న విషయం మీద సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రభావం చూపుతుందని అన్నారు.