స్వశక్తితోనే దళితులకు సీఎం,పీఎం పదవులు. -కడియం శ్రీహరి:

వరంగల్:

దళితులకు ముఖ్యమంత్రి పదవి ఒకరు ఇస్తే వచ్చేది కాదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.దళితులు వాళ్లంతట వాళ్లు ఎదగాలి, నాయకత్వాన్ని పొందాలని ఆయన అభిప్రాయపడ్డారు.దళితుల నాయకత్వంలో పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలుంటాయని కడియం చెప్పారు. రాజకీయ పార్టీల నాయకత్వం దళితుల చేతుల్లో లేనప్పుడు వారికి ముఖ్యమంత్రి పదవి వస్తదని నేను ఊహించుకోనని తెలిపారు.రాజకీయ అధికారంలో దళితులకు సముచిత స్థానం ఉండాలి, రాజ్యంగంలో బి.ఆర్ అంబేద్కర్ పొందుపర్చిన రిజర్వేషన్ సక్రమంగా అమలు కావాలి. వాళ్లు గౌరవంగా బతకాలని కోరుకుంటానని ఆయన అన్నారు. “అవకాశం వస్తే దళితులు ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు..ప్రధాన మంత్రులు కావచ్చు. వద్దని నేను ఎందుకు అనుకుంటాను. మాయావతి ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె స్వశక్తితో వచ్చారు. స్వశక్తితో ఎదిగి వచ్చి ముఖ్యమంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా ఎక్కువగా గర్వ పడేది నేను” అని కడియం తెలిపారు.
స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థిగా కడియం శ్రీహరి రావాలని స్టేషన్ ఘన్పూర్ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వరంగల్స ర్క్యూట్ గెస్ట్ హౌజ్ కు తరలించారు.

కడియంను గృహనిర్భందం చేసే పిలుపుతో గెస్ట్ హౌజ్ ను ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ముంచెత్తారు.కార్యకర్తలు, ప్రజల అభిమానానికి పాదాభివందనం చేస్తున్నానని కడియం అన్నారు.కేసిఆర్ నిర్ణయం ఏదైనా తూ.చ తప్పకుండా పాటించే వ్యక్తిని, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేసే వ్యక్తినని ఆయన తెలిపారు.క్రమశిక్షణ గలిగిన నాయకునిగా, కార్యకర్తగా పార్టీ అధ్యక్షుని నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అదే కార్యకర్తలకు చెప్పానని కడియం మీడియాకు చెప్పారు.వరంగల్ లో 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేసే విధంగా అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి వేలాదిగా టిఆర్ఎస్ కార్యకర్తలు తనపై ఉన్న అభిమానంతో, పార్టీపై ఉన్న నమ్మకంతో, కేసిఆర్ పై ఉన్న విశ్వాసంతో ఇక్కడకు వచ్చారని చెప్పారు. పార్టీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారని, కానీ తాను ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీగా ఉన్నానని, పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ ఎంతో నమ్మకంతో తనకు ఉన్నతమైన స్థానం కల్పించారని కడియం తెలిపారు. టిఆర్ఎస్ పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ నేను ఆశించిన దానికంటే ఎక్కువగా గౌరవం, స్థానం లభించిందన్నారు.

నియోజక వర్గంలో కొంత అసంతృప్తి ఉందని ఆయన అంగీకరించారు. ఆశించిన అభివృద్ధి జరగలేదనే బాధ ఉందన్నారు. తాను మళ్లీ అభ్యర్థిగా వస్తే నియోజకవర్గం బాగు పడుతదనే నమ్మకంతో తన దగ్గరకు వచ్చినట్లు భావిస్తున్నానన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ సమగ్రంగా ఆలోచించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అభ్యర్థులను ప్రకటించారని తెలిపారు. పార్టీ క్రమశిక్షణకు లోబడి ప్రకటించిన అభ్యర్థులకు సహకరించవలసిన అవసరం ఉందన్నారు.

క్రమశిక్షణ గలిగిన నాయకునిగా, కార్యకర్తగా పార్టీ అధ్యక్షుని నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అదే కార్యకర్తలకు చెప్పానన్నారు.గడిచిన కొన్ని సంవత్సరాలుగా వారి బాధను తనతో చెప్పుకోవడానికి ఇక్కడకు వచ్చారని తెలిపారు. వారి బాధను, ఆవేదనను, ఆవేశాన్ని, అభిప్రాయాలను కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులు ప్రచారానికి ఆహ్వానిస్తారో ఆయా నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం పని చేస్తానని కడియం చెప్పారు.

“జిల్లా వ్యాప్తంగా నాకు పరిచయాలున్నాయి. ప్రజల్లో కడియం శ్రీహరి పట్ల కచ్చితమైన, నిశ్చితమైన అభిప్రాయం ఉంది.పార్టీ కోసమే కడియం పనిచేస్తాడు. పార్టీకి నష్టం చేసే పని చేయను.ఆవేశంగా ఉన్న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కార్యకర్తలకు విజ్ణప్తి చేస్తున్నాను…మనం కష్టపడి తెలంగాణను తెచ్చుకున్నాం..ముఖ్యమంత్రిగా కేసిఆర్ గారు ఎంతో కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలో 2018లో జరిగే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన చారిత్రక అవసరంఉంది. ఇంకో టర్మ్ టిఆర్ఎస్ ఉంటే తెలంగాణ రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో కేసిఆర్ నాయకత్వంలో నిలబడే అవకాశం ఉంది.చిన్న, చిన్న ఆవేశాలను, అభిప్రాయబేదాలను పక్కన పెట్టి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, కేసిఆర్ నాయకత్వంలో పనిచేసే కార్యకర్తలుగా అభ్యర్థి గురించి ఆలోచించకుండా టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే విధంగా అందరం కష్టపడి పనిచేద్దాం. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గ కార్యకర్తలు, ప్రజలకు విజ్ణప్తి టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించండి. మీ నియోజకవర్గ అభివృద్ధిలోగానీ, మీ సమస్యల పరిష్కారంలోగానీ నేను ముందుండి పనిచేస్తాను. నాపట్ల కనపర్చిన అభిమానానికి పాదాభివందనం.ఎన్నికల సమయంలో అలకలు, బుజ్జగింపులు, నిరసనలు సర్వ సాధారణం. ఇవన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటాం.వరంగల్ 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేసే విధంగా అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తాం.వచ్చే వారం పదిరోజుల్లో సర్ధుకుంటాయి. నోటిఫికేషన్ వచ్చే నాటికి పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు బాగా పెరుగుతాయి. అభ్యర్థులు మార్చే అవకాశం లేదని కేసిఆర్ గారు స్పష్టంగా చెప్పారు. స్వతంత్రంగా పోటీ చేసినా ఫలితం ఉండదు. ఈరోజుల్లో స్వతంత్రంగా పోటీ చేయడం సామాన్యమైన విషయం కాదు. అభ్యర్థుల విజయావకాశాలు పార్టీకి ప్రజల్లో ఉండే ఆధరాభిమానాలపై ఆధారపడి ఉంటాయి తప్ప వ్యక్తులపై కాదు. ఆజ్ తక్ సర్వేలో కూడా కేసిఆర్ , టిఆర్ఎస్ పట్ల ప్రజలు ఏరకంగా విశ్వాసంగా ఉన్నారో స్పష్టంగా బయటపడింది. టిఆర్ఎస్ పార్టీ కేసిఆర్ నాయకత్వంలో బ్రహ్మండమైన మెజారిటీతో గెలుస్తుంది. మళ్లీ కేసిఆర్ సిఎం అవుతారు. ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.అనవసరంగా తొందరపడి నిరసనలు, తిరుగుబాటు ప్రయత్నాలు చేయొద్దని విజ్ణప్తి చేస్తున్నాను.భారతదేశంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీగారు ప్రధాని అయ్యాక దళితులకు రక్షణ లేకుండా పోయింది. దళితులపై దాడులు జరిగాయి. దళితుల ఆహారపు అలవాట్లపై కూడా దాడి జరిగింది. దళితుల గురించి, వారి భవిష్యత్ గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి, అమిత్ షాకు లేదు. దేశవ్యాప్తంగా దళితులు ఏవిధంగా ఇబ్బంది పడుతున్నారో వాటికి అమిత్ షా సమాధానం చెప్పాలి.తెలంగాణలో దళితులం ఉన్నతంగా ఉన్నాం. టిఆర్ఎస్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది పార్టీ నిర్ణయం. టిఆర్ఎస్ పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. ప్రజలపై నమ్మకం ఉంది. మేం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ప్రజల్లోకి వెళ్తున్నాం.
మీకు కడుపు నొప్పి ఎందుకు. గెలువలేక కాంగ్రెస్, బిజెపి మాట్లాడుతున్న మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అని కడియం శ్రీహరి అన్నారు.