హరితహారం బూటకం. హరితహారం పేరిట నిధులు స్వాహా – ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.

ఎస్.కె.జకీర్.
”హరితహారం పేరుతో కోట్లాది రూపాయలు వృధా వుతున్నాయి. లక్షలాది మొక్కలను లెక్కల్లో చూపుతున్నారు. ఎక్కడా మొక్క నాటిన దాఖలాలు లేవు వేసిన మొక్కలకు దిక్కు మొక్కు లేకుండా పోయింది. వాటిని పట్టించుకునే నాధుడే లేడు”. ఈ మాటలు ప్రతిపక్షనాయకులు అంటే విశేషం కాదు. ప్రభుత్వ పథకాలలో లోపాలను ఎండగట్టడం, ప్రభుత్వ ఉద్యోగులపై తిరగబడటం వంటివి సాధారణంగా కమ్యూనిస్టు పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు చేస్తుంటాయి. కానీ ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే, క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఉండి ఇలాంటి ఆరోపణలు చేయడం చర్చకు దారితీస్తుంది. ఫారెస్ట్ అధికారులపై భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యుడు తాటి వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మవుతున్నాయి. అశ్వారావుపేట ఏజెన్సీ నియోజకవర్గంలో పొడు భూముల విషయంలో ఏళ్ల తరబడి ఫారెస్ట్ అధికారులకు, గిరిజనులకు గొడవలు జరుగుతూ ఉన్నాయి. అటవీ భూముల్లో ప్రవేశించారని అధికారులు, పోడు చేసుకున్న భూములను ఆక్రమిస్తున్నారని గిరిజనులు ఘర్షణ పడటం, పరస్పర దాడులు ఆ ప్రాంతాల్లో సర్వసాధారణం. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు గిరిజనులకు సంఘీభావంగా ర్యాలీలు , ధర్నాలు నిర్వహిస్తున్న సందర్భాలు ఉన్నవి. పొడు భూములలో సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టా,పాస్ బుక్ లు 2005 లో అప్పటి ముఖ్యమంత్రి వై.స్ రాజశేఖరరెడ్డి ఇచ్చారు. అప్పటినుంచి వ్యవసాయం చేస్తుండగ ‘హరిత హారం’ పేరుతో ఫారెస్ట్ అధికారులు తమ పొలాల్లోకి వచ్చి, పంటలను ధ్వంసం చేస్తూ, తమను కేసుల పాలు చేస్తున్నారని గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ‘హరితహారం’ నాలుగవ విడత ప్రారంభం కానున్న తరుణంలో ”ఫారెస్ట్ అధికారులు డబ్బుకు అమ్ముడుపోయి డబ్బు ఇవ్వని వాళ్ళ భూముల్లోకి వెళ్తున్నారు . నేను గిరిజన బిడ్డనే. ఈ ప్రాంతంలో మా వాళ్ల జోలికి వస్తే కాళ్ళు విరగొడ్తా, ఖబడ్దార్” అని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్, అశ్వారావుపేట ఎం.ల్.ఏ తాటి.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. తన నియోజకవర్గంలో గిరిజనుల కోసం ఎంతవరకైనా వెళ్తానని గిరిజనుల జోలికి వస్తే ఊరుకొనని హెచ్చరించారు. ”పోడు భూముల జోలికి వస్తే ఫారెస్ట్ అధికారులపై దాడులు చేయండి” అని సాక్షాత్తు అధికారపార్టీ శాసనసభ్యుడు బహిరంగంగా పిలుపునివ్వడం విమర్శలు వినిపిస్తున్నవి. హరితహారం పధకం మూడు విడతలు సాగినప్పుడు చూస్తూ ఊరుకొని ఇప్పుడు ‘ కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నార’ని ఎలా అంటున్నారని, ఎన్నికలు దగ్గరపడుతుండటం తో ఓటర్లను మభ్యపెట్టే కంగారులో’ ప్రభుత్వ పథకాల డొల్లతనం’ బయట పెట్టారని ప్రతిపక్షాలు కోరుతున్నవి. నిజాన్ని శాసనసభ్యుడే స్వయంగా ఒప్పుకున్నందున హరితహారం పథకంలో అక్రమాలపై కమిటీ వేసి దోషులెవరో బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నవి.అధికారులకు ప్రజలకు మధ్య విబేధాలు వస్తే సమన్వయం చేయవలసిన ప్రజా ప్రతినిధి ఏకంగా అధికారులపై దాడులు చేయమని పిలుపునివ్వడం ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు మధ్య ఆజ్యం పోసినట్టవుతుందన్న విమర్శలు వస్తున్నవి. అధికారులను కాళ్లు విరగ్గొడతానని ఎమ్మెల్యే హెచ్చరించడం, అధికారుల మీద దాడులు చేయమని ప్రోత్సహించటం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రజా ప్రతినిధి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది.తాటి వెంకటేశ్వర్లు గత ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. తర్వాత ఖమ్మం ఎం.పి. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆయన వ్యాఖ్యలు, చేస్తున్న ఆరోపణలు ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుజేసే అవకాశాలు ఉన్నవి.