హాట్సాఫ్..! ఇరిగేషన్ మినిస్టర్

సిద్ధిపేట:
తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న తీరుపై సాగునీటి పారుదల రంగ నిపుణులు, ఇంజనీర్లను మరిపించేలా ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్ అన్నీ తానై ఓ గైడ్ లా.. తమకు వివరించారని రంగనాయక సాగర్ టన్నెల్ సందర్శించిన జిల్లా వైద్యులు,అడ్వకేట్, టీచర్స్, టీఎన్జీఓస్ బృందాలు తెలిపాయి. సిద్ధిపేట జిల్లా నుంచి దాదాపు 300 మంది సభ్యులతో కూడిన ఈ బృందాలు శుక్రవారం సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ మేరకు చంద్లాపూర్ లోని క్యాంపు కార్యాలయ ఆవరణలో శనివారం రాత్రి వరకూ ఎల్ఈడీ స్క్రీను పై ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సవివరంగా మంత్రి హరీశ్ రావు వివరించారు. కాళేశ్వరం పనుల్లో జరుగుతున్న స్పీడ్ చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏక్కడా తడబడ లేదు.. ఏక్కడా పొరపాట్లు అసలే లేవు.. కాళేశ్వరం పనుల్లో ఏ ఏ ప్యాకేజీల్లో ఎంత మేర పనులు పూర్తయ్యాయి. ఇంకా ఎంత మేర చేయాల్సి ఉంది. ఆ పనులు ఎన్ని రోజుల్లో పూర్తవుతాయి, ఎన్ని రోజులలో నీళ్లు వస్తాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం ఎలా ఉంది. ఎలా నీళ్లను పైకి తీసుకొస్తున్నామనే.. పూర్తి వివరాలను ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్ రావు శుక్రవారం రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వచ్చిన వైద్య, అడ్వకేట్, టీచర్స్, టీఎన్జీఓల బృందానికి వివరించారు. లైవ్ విజువల్స్ ద్వారా ఎక్కడెక్కడ ఏ ప్యాకేజీలో ఏ మేర పనులు జరుగుతున్నాయి. ఎంత శాతం పూర్తయింది. ఇంకా ఎన్నీ రోజుల్లో పనులు పూర్తి అవుతాయనే అంశాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ లక్ష్యంతో రూపొందించారో సవివరంగా వివరించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చడం సీఎం కేసీఆర్ సంకల్పం అంటూ.. ఆరు దశాబ్దాలుగా తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన అన్యాయాన్ని మంత్రి వివరించారు.తెలంగాణ ఉద్యమం లో పల్లె,పల్లె తిరిగినప్పుడు, రైతులను, ప్రజల బాధలను, ఆయన చదివారని, తెలంగాణా సమాజాన్ని కేసీఆర్ గొప్పగా అధ్యయనం చేశారన్నారు. ఆ అధ్యయనం వల్లనే ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారని, ప్రాణహిత ప్రాజెక్టు కాళేశ్వరంగా రూపాంతరం చెందిందన్నారు. కేసీఆర్ ఇంజనీర్ గా మారారని చెప్పారు. ప్రాజెక్టు అంటే పదేళ్లు, ఇరవైయేళ్లు
అనే అభిప్రాయాలను కేసీఆర్ తుడిచిపెట్టారని ఇరిగేషన్ మినిస్టర్ చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి, మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ల ద్వారా నిజామాబాద్ జిల్లాలోని హల్దీ వాగుకు నీళ్లేలా ప్రవహిస్తాయో, అక్కడి నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టుకు నీరు ఎలా ప్రవహిస్తుందో చెప్పుకొచ్చారు. అలాగే గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులతో ఆలేరు ప్రాంతాల్లో ఫ్లోరైడ్ పీడిత ప్రజల, రైతుల కరువు ఏలా మాయమవుతుందో హరీశ్ రావు వివరించారు ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నట్లు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 18 లక్షల కొత్త ఆయకట్టు మరో 18 లక్షల ఆయకట్టును స్థిరీకరించి మొత్తంగా 36 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి ప్రణాళికలు రూపాందించి ఉత్తర తెలంగాణలోని ఒక్క ఎకరం కూడా బీడు పడకుండా చేయాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేస్తున్నామని మంత్రి హరిశ్ రావు బృందాలకు వివరించారు. కాళేశ్వరం వెళ్లి స్వయంగా పనులు పరిశీలించిన, పనుల తీరును, దాని ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు వివరించాలని మంత్రి సూచించారు. మంత్రి వివరణతో బృందాలు ఫిధా అయ్యాయి. ఇంత గొప్ప ప్రాజెక్టును స్వయంగా పరిశీలించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆయా బృందాలకు చెందిన పలువురు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావు సూచన మేరకు కాళేశ్వరం వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను కూడా చూశామని, ఇది తమకు దక్కిన గౌరవం, ఒక భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఎన్సీ హరిరాం, ఎస్ఈ ఆనంద్, ఇతర ఇరిగేషన్ అధికారులు, జిల్లాలోని వైద్యులు, న్యాయవాదులు, టీచర్లు, టీఎన్జీఓస్ ఉద్యోగుల బృంద సభ్యులు ఉన్నారు.