హిందీ రాష్ట్రాలతోనే భారత్ ఏర్పడలేదు

హిందీ రాష్ట్రాలతోనే భారత్ ఏర్పడలేదు

హిందీ మాట్లాడే రాష్ట్రాలతోనే భారత్ ఏర్పడిందనుకొనే రోజులు పోయాయని శనివారం డీఎంకే అధ్యక్షుడు ఎం కె స్టాలిన్ వ్యాఖ్యానించారు. డీఎంకే శ్రేణులకు రాసిన లేఖలో ‘హిందీ మాట్లాడే రాష్ట్రాలతోనే భారత్ ఏర్పడిందనుకొనే కాలం ముగిసింది. ఇది నిర్మాణాత్మక రాజకీయాల సమయం. రాష్ట్రాలపై కేంద్రం తన దృష్టి పెట్టాలని’ పేర్కొన్నారు. ‘కేంద్రంలో అధికారానికి వచ్చిన ఏ పార్టీ అయినా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు అన్ని రకాల జాతులను కలుపుకొని మద్దతివ్వాలని’ స్టాలిన్ చెప్పారు.

ఇతర రాష్ట్రాలలో కూడా తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసేందుకు తన పార్టీ దేశంలోని ఇతర లౌకిక శక్తులను ఒక్కతాటిపైకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తుందని డీఎంకే అధ్యక్షుడు అన్నారు. తమిళనాడులోని 38 లోక్ సభ స్థానాల్లో 37 డీఎంకే నేతృత్వంలోని కూటమి గెలుచుకుంది. దీంతో అధికార ఏఐఏడిఎంకే నాయకత్వంలోని కూటమి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. లోక్ సభ ఎన్నికలతో పాటు 22 అసెంబ్లీ సీట్లకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో డీఎంకే 13 స్థానాలు గెలుచుకుంది. ఈ విజయంతో తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే మొత్తం సభ్యుల సంఖ్య 101కి పెరిగింది.