హైదరాబాద్ లో పసుపు పై రేపు వర్క్ షాపు.

హైదరాబాద్:
Spices Board సోమవారం (రేపు) పసుపు పంటపై హైదరాబాద్ లో వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. హైదరాబాద్ బేగంపేట లోని ప్లాజా హోటల్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వర్క్ షాప్ కు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు అతిథులుగా పాల్గొంటారు. పసుపు రైతులను ఆదుకునేందుకు ఎంపి కవిత కృషి చేస్తున్న విషయం తెలిసిందే. పసుపు బోర్డ్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ తో పాటు వ్యవసాయ మంత్రిని కలిసి పలుమార్లు విజప్తి చేశారు. ఈ నేపథ్యంలో పసుపు పంట, ధరలు, ఎగుమతులు, యాజమాన్య పద్ధతులపై అధ్యయనం చేయడంతో పాటే రైతులకు, అధికారులకు అవగాహన కల్పించేందుకు స్పైసీస్ బోర్డ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తోంది. తెలంగాణలో సాగవుతున్న పసుపు పంట రకాలు, అనువయిన రకాలు, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ మెళకువలు, ఎగుమతిపై అనుసరించాల్సిన వ్యూహంపై వర్క్ షాప్ లో చర్చిస్తారు. స్పైసేస్ బోర్డ్ అధికారులు, సైంటిస్టులు, పసుపు రైతులు, పసుపు పండే ప్రాంతాల మార్కెట్ కమిటీల చైర్మన్ లు, డైరెక్టర్లు వర్క్ షాప్ లో పాల్గొంటారు.
అలాగే వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి. పార్థసారథి, పరిశ్రమల శాఖ కమిషర్ అహ్మద్ నదీమ, ఉద్యానవన శాఖ కమిషర్ ఎల్. వెంకట్రామిరెడ్డి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ (మార్కెటింగ్) జి. లక్ష్మి భాయి, నాబార్డ్ డిజీఎం సిఎస్ ఆర్ మూర్తి పాల్గొంటారు.