హైద్రాబాద్‌లో కడ్తాల్ విద్యార్థి ఆత్మహత్య.

హైదరాబాద్:
కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి హైద్రాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెల్పిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన ఆదిమూలం బిక్షపతికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవేందర్ జర్మనీలో విద్యనభ్యసిస్తుండగా, రెండవ కుమారుడు శివ, చిన్న కుమారుడు యశ్వంత్‌లు హైద్రాబాద్ హస్తీనాపురం ఓం కారేశ్వర్ నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకుంటూ చదువుకుంటున్నారు. గురువారం ఉదయం ఇద్దరు సోదరులు హస్తీనాపురంలోని ఓ హోటల్‌లో అల్పాహారం చేశారు. తాను రూంకు వెళ్లి వస్తానని సోదరున్ని ఇక్కడే ఉండాలని చెప్పిన యశ్వంత్ రూంకు వెళ్లి తిరిగి రాకపోవడంతో, కాసేపటికి రూంకు వెళ్లిన శివకు యశ్వంత్ ఉరివేసుకుని చనిపోయి కన్పించాడు. యశ్వంత్ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండు యశ్వంత్ మృతిని గ్రామస్తులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా యశ్వంత్ మృతికి ఇటీవల అతను వ్రాసిన ఈసెట్‌లో మంచి ర్యాంకు రాకపోవడమే కారణమని తెలుస్తుంది.
అతని చూపు సజీవం…. యశ్వంత్ మృతి చెందిన అతని చూపు మాత్రం సజీవంగా మిగిలింది. తాను మరణించిన తన నేత్రాలతో మరో ఇద్దరికి చూపు ప్రసాదించాడు. యశ్వంత్ నేత్రాలను దానం చేస్తే మరో ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చని అతని స్నేహితులు యశ్వంత్ తండ్రిని అడుగగా ఆయన ఒప్పుకోవడంతో రమాబాయమ్మ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్ వారికి సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం యశ్వంత్ మృతదేహాన్ని తరలించిన ఉస్మానియా ఆసుపత్రికి వచ్చిన కంటి వైద్యులు యశ్వంత్ నేత్రాలను సేకరించారు. యశ్వంత్ మృతి చెందిన అతని నేత్రాలు ఇద్దరికి చూపును అందిస్తు సజీవంగా ఉంటాయని పలువురు అన్నారు