హోరాహోరీ కానున్న పెద్దపల్లి.

పెద్దపల్లి;
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదు. సీఎం కేసీఆర్ సర్వేల్లో పాస్‌ మార్కులు కూడా సంపాదించుకోలేని అధికారపార్టీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి మళ్లీ టిక్కెట్‌ దక్కుతుందా, లేదా చర్చ జరుగుతున్నది. జిల్లా కేంద్రం అయ్యాక పెద్దపెల్లి అసెంబ్లీ స్థానంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పలు విద్యాసంస్థల అధినేతగా కూడా అటు పెద్దపెల్లి, ఇటు కరీంనగర్‌లో చాలామందికి సుపరిచితుడు. విద్యాసంస్థల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా తనకు కచ్చితమైన ఓట్‌బ్యాంక్‌గా ఆయన మదిలో ఉంది. ధనబలం ఉన్నది. మరోవైపు అధికారపార్టీ. ఇవే ఇప్పుడాయన బలం. అయితే ఇదంతా ఆయనకు టిక్కెట్‌ దక్కుతుందా లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుందన్నా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రజల్లో ఆయనకు తగినంత బలం లేదన్న వాదన అధికారపార్టీ నాయకుల్లోనే ఉంది. అంతేకాదు. ఒకవేళ టిక్కెట్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డీకి దక్కినా మిగతా టిఆర్ ఎస్ నాయకులు సహరిస్తారో లేదో సస్పెన్సు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఈదశంకర్‌రెడ్డి కూడా టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కూడా ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. చాలాకాలం నుంచీ రెడ్డీ సామాజికవర్గ ప్రాబల్యం ఉన్న వారే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎరిక్ అవుతున్నారు. ఈ టిక్కెట్‌ను మరోసారి కూడా రెడ్డిలకే ఇవ్వాలన్న యోచనలో టీఆర్ఎస్ పెద్దలున్నట్టు తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్‌లోకి ఇప్పుడున్నవాళ్లే కాకుండా కొత్త ముఖాలు రావొచ్చని చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డితో పాటు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కూడా రాహూల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరెక్కువైంది. అంతేకాదు… వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. విజయరమణారావు నిత్యం జనంలో ఉండే నేతగా సానుకూల వాతావరణమైతే కనిపిస్తున్నది. దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కోడలు గీట్ల సవితారెడ్డి పెద్దపెల్లి టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విజయరమణారావుకు టిక్కెట్‌ ఎలా ఇస్తారని సవితారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు అడ్డుపడే అవకాశాలున్నవి. విజయరమణరావు కు మాస్‌ ఫాలోయింగ్ ఉన్నది. నిత్యం జనంలో ఉండే ఆయన శైలి కాంగ్రెస్‌పార్టీకి ఓ సీటైతే కచ్చితంగా తెచ్చిపెడుతుందన్న భావనలో కాంగ్రెస్‌ పెద్దలు ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజాచైతన్య యాత్ర సందర్భంగా విజయరమణకు ప్రాధాన్యం లభించింది. రాహూల్‌గాంధీతో సాన్నిహిత్యమున్న ఎన్ఆర్ ఐ గొట్టిముక్కల సురేష్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో అసమ్మతి నేతగా ఉన్నగీట్ల సవితారెడ్డిని కూడా టీఆర్ఎస్‌లోకి లాగి, మహిళా సెంటిమెంటుతో బరిలోకి దింపనున్నారా అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ నుంచి విపరీతమైన పోటీ ఉన్న నేపధ్యంలో తనకు టిక్కెట్‌ దక్కకపోతే తెలంగాణా జనసమితి పార్టీ నుంచి బరిలోకి దిగే యోచనలో గొట్టిముక్కల సురేష్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపి నుంచి గతంలో పెద్దపెల్లి స్థానానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన గుజ్జుల రామకృష్ణారెడ్డి ఈ సారి బరిలో ఉండవచ్చు.