15 న గోదావరి బ్రిడ్జి పై ‘జనసేన’ మార్చ్!!

రాజమండ్రి:

ఈ నెల 15న ధవళేశ్వరం బ్యారేజీపై జరిపే కవాతుతో జనసేన సత్తా గురించి దేశం మొత్తం చర్చించుకోవాలని, దెబ్బకు దద్దరిల్లిపోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడలో తూర్పుగోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలతో పవన్ శనివారం భేటీ అయ్యారు. 15న కవాతుతో తూర్పు గోదావరిలో అడుగుపెట్టి పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని తెలిపారు. జిల్లా ప్రజల తీర్పు రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని, తూర్పుతోనే మార్పు ప్రారంభం కావాలని పవన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జనసేనకు బలమున్న ప్రాంతమని, అక్కడ పట్టు సాధించ లేకపోతే అది నాయకుల తప్పే అవుతుందని చెప్పారు. జనసేనకు తూర్పు గోదావరి జిల్లా ఆయువుపట్టు అని, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 నుంచి 22 రోజుల పాటు పర్యటిస్తానని చెప్పారు. పార్టీలో కోటరీలకు తాను వ్యతిరేకమని జనసేనాని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పితాని బాలకృష్ణ మినహా ఎవరికీ పార్టీ టికెట్ ఇవ్వలేదన్నారు. టిక్కెట్లు ఇస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దని.. కమిటీ పారదర్శకతతో కేటాయింపులు జరపనుందని పవన్ వెల్లడించారు. ఒక లక్ష్యంతో నిర్వహిస్తున్న కవాతు గురించి దేశమంతా మాట్లాడేలా చేయాలని కార్యకర్తలను కోరారు. ఇందుకోసం తాను చేయాల్సింది చేస్తానని, మీరు చేయాల్సింది మీరు చేయాలని కార్యకర్తలకు చెప్పారు. తాను రాజకీయాల్లోకి ఎంతో ఆవేదనతో, బాధతో సమస్యలపై పోరాడాలనే ఉద్దేశంతోనే వచ్చానన్నారు.