17,000 చెట్లను నరికేస్తారా? ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.

న్యూఢిల్లీ:
ఢిల్లీ హైకోర్ట్ నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) చేపట్టిన చెట్ల నరికివేతకు బ్రేక్ వేసింది. చెట్ల నరికివేతకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతినిచ్చిందా అని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ జరిగే జూలై 4 వరకు దేశ రాజధానిలో ఎలాంటి చెట్లను నరకరాదని ఎన్బీసీసీకి ఢిల్లీ హైకోర్ట్ సూచించింది. ప్రభుత్వాధికారులు, వీఐపీల నివాసాలు, కమర్షియల్ కాంప్లెక్స్ ల కోసం ఎన్బీసీసీ 17,000కి పైగా చెట్ల నరికివేతకు సిద్ధమైంది. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. కాలనీల పునర్ నిర్మాణం పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేకే మిశ్రా అనే పౌరుడు పిటిషన్ వేశారు. వివాదాస్పద ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి.
ఢిల్లీలో 9 లక్షల చెట్ల కొరత ఉందని.. అలాంటిది 17,000 చెట్లను నరకడం సమంజసం కాదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్టే ఇవ్వాలని ఆయన కోరారు. కేసు విచారణ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లు, భవనాల నిర్మాణం పేరుతో చెట్ల నరికివేతను ఢిల్లీ తట్టుకోగలదా అని ఢిల్లీ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. దక్షిణ ఢిల్లీలో 7 కొత్త కాలనీల పునరాభివృద్ధి కోసం 17,000 చెట్లను నరికేస్తున్నారన్న వార్తతో పలువురు ఢిల్లీవాసులు ఆ చెట్ల చుట్టూ మానవహారంగా నిలబడి ప్రదర్శనలు చేశారు. ఢిల్లీ హైకోర్ట్ ఆదేశాలను ఆప్ స్వాగతించింది. బహిరంగంగా 17,000 చెట్ల హత్యను ఆపినట్లయిందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రత్యేకంగా విచారణ జరుపుతోంది.