26న కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి తెలంగాణ పారిశ్రామికవేత్తల బృందం

టీఎస్ -ఐసీసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సారథ్యంలో 200 మంది ప్రాజెక్టు పనుల సందర్శన:

హైదరాబాద్:
ఈ నెల 26వ తేదీన టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సారథ్యంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయన యాత్ర చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు సందర్శనలో రాష్ట్రంలోని 20 పారిశ్రామికవాడలకు చెందిన సుమారు 200 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. ఇందుకోసం తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఐఎఫ్) అధ్యక్షుడు కె సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక రోజు అధ్యయన యాత్రలో భాగంగా మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ టన్నెల్, పంపు హౌస్, రిజర్వాయర్ నిర్మాణ పనులను పారిశ్రామివేత్తల బృందం పరిశీలించనుంది. ఇందుకోసం 10 ప్రత్యేక బస్సులను ఇప్పటికే సిద్ధం చేశారు. హైదరాబాద్ నుండి ఉదయం బయలుదేరి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రాత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. మధ్యలో భోజన విరామం ఉండేలా ఏర్పాట్లు చేపట్టారు. భారీ సాగునీటి, ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో అత్యద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి కాళేశ్వరం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంజనీరింగ్ నిపుణులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు చూసి అద్భుతమని కొనియాడరని గుర్తు చేశారు. ఇంజనీరింగ్ కళాకండంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టును అన్ని శాఖల, వర్గాల ప్రజలు సందర్శిస్తున్నారని, పారిశ్రామికవేత్తలను కూడా ప్రాజెక్టు అధ్యాయానికి తీసుకు వెళుతున్నామని తెలిపారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని పాడి పంటలతో కూడిన ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దాలన్నడే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సేద్యానికి అనుకూలమైన ప్రతి అంగుళం భూమికి నీటిని అందించి రైతుల సాగునీటి కష్టాలకు ముగింపు పలికేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ జరుగుతుందన్నారు. కాళేశ్వరం దేశంలోనే గొప్ప సాగునీటి ప్రాజెక్టుగా ఇప్పటికే అందరి మన్నలను అందుకుంటుందన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించి ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించాలని సిఎమ్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని బాలమల్లు తెలిపారు.