29న కేరళ తాకనున్న నైరుతి.

తిరువనంతపురం:

నైరుతి రుతుపవనాలు ఈ నెల 29 నాటికి కేరళ చేరుకుంటాయని స్పష్టం చేసింది భారత వాతావరణ శాఖ. ప్రస్తుతం నైరుతి అరేబియా సముద్రంలో ఉన్న తీవ్ర తుఫాను 26 నాటికి తీరం దాటనుందని, ఆ తర్వాత రుతుపవనాలకు అనుకూల వాతావరణం నెలకొంటుందని వివరించింది. 27వ తేదీ రాత్రికల్లా ఆగ్నేయ అరేబియా సముద్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. 28 నాటికి లక్షద్వీప్‌, కేరళను పడమర గాలులు తాకనున్నాయని, 29 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. నిన్న(గురువారం) ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులను నైరుతి గాలులు తాకాయి. ఇవాళ బంగాళాఖాతంలోని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయి. ఇంకా 29 నాటికి ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, నెలాఖరుకు ఈశాన్య రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. జూన్‌ రెండో వారంలో వాయువ్య బంగాళాఖాతంలో రుతుపవన అల్పపీడనం ఏర్పడుతుందని, రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉందని పేర్కొంది.