30 న కోదండ రామ్ యాత్ర. యాత్ర లో 300 మంది ఎన్ఆర్ఐలు. హైదరాబాద్‌ నుంచి వాంకిడి యాత్ర.

హైదరాబాద్‌ :
ప్రొఫెసర్‌ కోదండరాం తలపెట్టిన తెలంగాణ జనసమితికి విదేశాల్లో ఉన్న తన శిష్య బృందం 300 మంది ఎన్ఆర్ఐలు తెలంగాణ గడ్డపై పర్యటించేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినవారు, ఆ తర్వాత అసహనానికి గురైన శక్తులంతా తెలంగాణ జనసమితిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసమితి బలాన్ని అంచనా వేసేందుకు ఈ నెల 30న ఈ యాత్ర మొదలై నెల రోజుల పాటు హైదరాబాద్‌ నుంచి వాంకిడి వరకు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కోదండరాం శిష్యబృందమే కీలకంగా వ్యవహరించనున్నది. ఇందులో ఎన్ఆర్ఐలే ప్రధాన పాత్ర వహించనున్నారు. స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా, విద్యార్థులుగా, సర్వేయర్‌లుగా ఇలా వివిధ రూపాల్లో ఈ బృందం పర్యటించనుంది. హైదరాబాద్‌లో మొదలయ్యే యాత్ర గజ్వేల్‌ మీదుగా రాజీవ్‌రహదారి నుంచి వాంకిడి వరకు, హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వరకు ఇలా నెల రోజులపాటు కోదండరాం బలాబలాలను, ఇతర పార్టీల బహీనతలను అంచనా వేసేందుకు ఈ బృందం తన ప్రయత్నాలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ బలాన్ని అంచనా వేస్తూ బహీనతలను గుర్తించే పనిలో బృందం పనిచేయనున్నది. అలాగే టిఆర్ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధుపై ప్రజలు ఏమనుకుంటున్నారు…? కోదండరాం నుంచి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తున్నారు…? తెలంగాణ జనసమితి చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటి…? తదితర అంశాలపై ప్రజల నుంచి సమాధానాలను రాబట్టేందుకు ఈ యాత్ర కొనసాగనున్నది. ప్రజాభిప్రాయమే ఎజండాగా ప్రధాన డిమాండ్లను ఈ బృందం సేకరించనున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ కార్యకలాపాలు ఆశాజనకంగా ఉన్నాయి. అందులో 21 స్థానాల్లో ఈ బృందం మొదటి దశ పర్యటించనుంది. అక్కడ మొదలైన కార్యాచరణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ఎన్ఆర్ఐలు కీలకంగా వ్యవహరించనున్నారు. దీని కోసం ఈ నెల 30 నుంచి రహస్యంగా కొన్ని చోట్ల బృందం పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ తర్వాతే కోదండరాం బస్సు యాత్ర బయల్దేరనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.