5 రోజులు శ్రీవారి దర్శనం బంద్.

తిరుపతి,:
టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నదా? శ్రీవారి దర్శనం ఐదు రోజులు నిలిపివేయనుందా? మనకు తెలిసిన చరిత్రలో ఇదేనా ఇలా జరగటం అంటే.. అవుననే సమాధానం వస్తుంది బోర్డు నుంచి. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణంలో భాగంగా ఆగస్ట్ 12 నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజులు శ్రీవారి దర్శనం నిలిపివేయాలని ప్రస్తుతానికి పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు రోజులు ఎవరికీ కూడా స్వామివారి దర్శనం ఉండదు. ఆలయం తెరిచి ఉంటుంది కానీ.. భక్తులకు ప్రవేశం ఉండదు.
లోకకల్యాణ దాయకమైన తిరుమలేశుని మూలవిరాట్టులోని స్వామి అంశ 12 ఏళ్ల పాటు కొలువుంటుంది. కాలపరిమితి తీరేలోపు శ్రీవారి అంశను.. ఒక కలశంలోకి ఆవాహన చేయాలి. 8 రకాలైన ద్రవ్యాలతో శ్రీవారి పద్మపీఠాన్ని బంధనం చేసి తిరిగి విరాట్‌ రూపంలో స్వామివారిని స్థిరపరచాలని వైఖానస ఆగమం చెబుతోంది. అందుకుకోసం అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం నిర్వహిస్తారు. ఈ మహాక్రతువును.. ఆగస్టు 12 నుంచి 16 వరకు ఈ క్రతువు జరిగేలా ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్ట్ 11వ తేదీన ఈ మహాఘట్టానికి అంకురార్పణ జరగనుంది.12 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాసంప్రోక్షణను ఐదు రోజులు ఆలయంలో ఆగమోక్తంగా చేపడతారు. వందల మంది వేద పండితులు, రుత్విక్కులు వివిధ రాష్ట్రాల నుంచి తరలిరానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 1958 నుంచి పత్రాలు అందుబాటులో ఉన్నాయి. 1958, 1970, 1982, 1994, 2006లో మహాసంప్రోక్షణ జరిగింది. గత అనుభవాలను చూస్తే.. ఈ మహోత్తర ఘట్టం సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శమానికి చాలా తక్కువ సమయం కేటాయించారు. పూర్వం మహా సంప్రోక్షణ జరిగిన సమయాల్లో తిరుమలకు ఇంతలా భక్తుల తాకిడి లేకపోవడంతో పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. ప్రస్తుతం రోజూ లక్ష మంది తిరుమలకు వస్తున్నారు. దీనికితోడు ఈసారి ఆగస్టు 15, వీకెండ్ సెలవులు కలిసివచ్చాయి. దీంతో భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించడం అసాధ్యమన్న భావన టి.టి.డి వర్గాల్లో కనిపిస్తోంది. మొత్తానికి మహాసంప్రోక్షణ జరిగే ఐదు రోజులు భక్తులకు దర్శనం నిలిపి వేయాలని నిర్ణయించింది. మరో ఆప్షన్ కూడా ఎంచుకుంది టీటీడీ. రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రోజుకు నాలుగు గంటలు దర్శనం కల్పించాలనే ఆలోచన కూడా చేస్తోంది. ఈ లెక్కన పాతిక వేల మందికి మించి దర్శనం కల్పించలేమని టీటీడీ అంచనా వేస్తోంది.ఆలయంలో సంప్రోక్షణ కోసం యాగశాలలు, తాత్కాలిక నిర్మాణాలు జరగనున్నాయి. ఇవి భక్తుల రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పాటు వైదిక క్రతువుకూ అంతరాయం కల్గించే ఆస్కారం కూడా ఉంటుంది. ఈ పరిస్థితులన్నింటినీ అంచనా వేస్తున్న టీటీడీ.. అసలు ఈ ఐదు రోజులు దర్శనం నిలిపివేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా భావిస్తోంది. దర్శనంపై తుది నిర్ణయం 14వ తేదీన తీసుకోనున్నారు.