80 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ‘గెలాక్సీ’. గుర్తించిన ఇస్రో ఆస్ట్రోశాట్.

ఢిల్లీ:
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఓ ఖగోళ అద్భుతాన్ని గుర్తించింది. ఇస్రోకి చెందిన మొట్టమొదటి మల్టీ వేవ్ లెంగ్త్ స్పేస్ అబ్జర్వేటరీ ఆస్ట్రోశాట్ ఒక అద్భుతమైన ప్రత్యేక గెలాక్సీ సమూహాన్ని తన కెమెరాలో బంధించింది. ఈ గెలాక్సీ సమూహం భూమికి 80 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. దీనికి ఏబెల్ 2256 అని పేరు పెట్టారు. దీనిని ఆస్ట్రోశాట్ ఫోటో ఆఫ్ ద మంత్ గా ఇస్రో ప్రకటించింది. ఈ ఫోటోని ప్రపంచంలోని అన్ని రేడియో టెలిస్కోపులకు పంపినట్టు తెలిపింది.ఏబెల్ 2256 గెలాక్సీలో మూడు వేర్వేరు గెలాక్సీ సమూహాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానిలో మరొకటి కలగలిసి పోయాయి. ఈ మూడు గెలాక్సీలలో 500కి పైగా గెలాక్సీలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మన పాలపుంతకు 100 రెట్లు పెద్దది. 1500 రెట్లు ఎక్కువ బరువుగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈ సమూహం ఎంతో దూరం విస్తరించిన గెలాక్సీలన్నిటినీ ఆకర్షించి ఒకటిగా చేసుకున్నట్టు తెలిపారు. ఇందులో 6 గెలాక్సీలను జూమ్ చేసిన ఖగోళ శాస్త్రవేత్తలు అల్ట్రావయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఉపయోగించి ఫోటోలు తీశారు. సాధారణంగా గెలాక్సీ సమూహాలు స్పైరల్ ఆకృతిలో ఉండి మెల్లమెల్లగా లెంటికులర్, అండాకార ఆకృతిలోకి మారతాయని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్పారు. మన పాలపుంత స్పైరల్ ఆకృతిలో, నీలం రంగులో ఉంటుంది. ఇందులో నిరంతరం నక్షత్రాలు తయారవుతూ ఉంటాయి. లెంటికులర్ గెలాక్సీ కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది. దీనిలో పాత నక్షత్రాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి.