‘అంబటి’కి కేబినెట్ బెర్తు!!

rathnakumar:

ఒక వ్యక్తి లేదా కుటుంబం సుదీర్ఘ కాలం తర్వాత అనుకున్నది సాధిస్తే..గతకాలపు వైభవానికి తిరిగి దగ్గరైతే ఆ భావనలు వారిని సంతోషసాగరంలో తేలియాడేలా చేస్తాయి. అందులోనూ అలాంటి పరిణామం..నేమూ ఫేమూ ఉండే రాజకీయాల్లోనైతే అవి మరింత ప్రసిద్ధి పొందుతాయి. వారిపేర్లు జనం నోళ్ళలో నానుతాయి. గతంలో శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి ఆ తర్వాతికాలంలో వరుస ఓటములకు గురైనా రాజకీయాల్లోనే కొనసాగి ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత కాలం కలిసొచ్చి మళ్ళీ పూర్వవైభవం చేరుకోవడం చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి పరిణామాలే ఇటీవలి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకున్నాయి. అవేంటో చూద్దాం!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు అంబటి రాంబాబు ఘనవిజయం సాధించారు. జిల్లాకు తూర్పు కొసన ఉన్న రేపల్లె నుంచి 1989లో రాంబాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 30ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ శాసనసభలో అడుగుపెట్టే అవకాశం ఈయనకు వచ్చింది . మామూలుగా వేరే వాళ్ళయితే ఒకసారి ఓడిపోయాక ఇంతకాలం రాజకీయాల్లో కొనసాగటమే కష్టం. కానీ రాంబాబు మొదట్నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డి కి నమ్మకమైన అనుచరుడిగా కొనసాగడం ..ఇంతకాలం రాజకీయాల్లో ఉండేలా చేసింది. మధ్యలో రెండు ప్రభుత్వరంగసంస్థల చైర్మన్ గా పనిచేసే అవకాశం వచ్చింది. 30ఏళ్ళ కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైన రాంబాబు మళ్ళీ ఇప్పుడు విభజిత ఆంధ్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాపు సామాజిక వర్గం నుంచి ఎన్నకైన ఎమ్మెల్యేల్లో ఈయనే సీనియర్ కాబట్టి క్యాబినెట్ బెర్తు దాదాపు ఖాయమే.
ఇదే జిల్లా తెనాలి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన అన్నాబత్తుని కుమార్ కుటుంబానికి గతకాలపు రాజకీయ వైభవం ఉంది. ఇతడి తండ్రి అన్నాబత్తుని సత్యనారాయణ 1983,1985లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖను నిర్వహించారు. అయితే ఈ చేసిన ఒక పొరపాటు ఆయన రాజకీయ జీవితానికి గ్రహపాటుగా మారి భవిష్యత్తు లేకుండా చేసింది. 1985 మార్చిలో అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్ వద్ద ఎన్నికల ప్రచారసభకు వెళ్ళి ప్రసంగిస్తూ.. తెలుగుదేశానికి ఓటేయకపోతే ఫలితాల తర్వాత మిమ్మల్నందర్నీ పాకిస్థాన్ కు పంపేస్తామంటూ ఓటర్లనుద్దేశించి నోరు జారారు. ఈ సంఘటన తీవ్రమైన వివాదానికి దారితీసింది. దీనిపై ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం ప్రకటించారు. ఆరోజుల్లో తెలుగుదేశంలో అధినాయకుడి ఆగ్రహానికి గురైన వ్యక్తి శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే! ఆ ఎన్నికల్లో సత్యనారాయణ తెనాలి నుంచి గెలిచినా మంత్రిపదవి మాత్రం రాలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్టీఆర్ దర్శనంకోసం వెళితే..’నా దగ్గరకు ఎందుకొచ్చారు? గెలిపించిన ప్రజల మధ్య ఉండండి. వెళ్ళండి’ అని ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కటువుగా వ్యాఖ్యానించిన పరిణామం అప్పట్లో ఒక సంచలనం. ఐదేళ్ళూ ఎమ్మెల్యేగానే కొనసాగిన సత్యనారాయణ ఆతర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. మళ్ళీ మూడు దశాబ్దాల అనంతరం ఆయన కుమారుడు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆవిధంగా అన్నాబత్తుని సత్యనారాయణ కుటుంబానికి 30ఏళ్ళ తర్వాత మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. కృష్ణా జిల్లా మైలవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వసంత కృష్ణప్రసాద్ ది మరో కథ. ఈయన తండ్రి వసంత నాగేశ్వరరావు తెలుగు దేశం పార్టీ తొలినాళ్ళలో ప్రసిద్ధ వ్యక్తి. ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా ప్రచారంలో వెంటతిరిగిన వసంత..నందిగామ నుంచి ఎన్నికై తెలుగుదేశం ప్రభుత్వంలో హోం , వ్యవసాయ శాఖల్ని నిర్వహించారు. ఈయన కూడా ఎన్టీఆర్ మనస్సులో స్థానం పోగొట్టుకున్న ఫలితంగా రాజకీయ గ్రహణాన్ని ఎదుర్కొని రాజకీయ అనామకుడిగా మిగిలిపోయారు. ఓ సందర్భంలో రాజకీయ ప్రాధాన్యత కోల్పోయి సాధారణ వ్యక్తిలా ఉన్న నాగేశ్వరరావు స్థితిపై ఎన్టీఆర్ ఒక వ్యంగ్య వ్యాఖ్య చేశారు. దాన్ని తేలిగ్గా తీసుకుంటూ..ఎన్టీఆర్ కు తాను గుర్తుండటం విశేషమేనని స్పందించారు. ఆతర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కాంగ్రెస్ లో చేరి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు(ఆప్కాబ్) చైర్మన్ పదవిని పొందారు. వైఎస్ తో ఉన్న సాన్నిహిత్యం ఫలితంగా జగన్ అండతో ఆయన కుమారుడు కృష్ణప్రసాద్ మైలవరం బరిలో నిల్చి దేవినేని ఉమామహేశ్వరరావు వంటి బలమైన వ్యక్తిని ఓడించారు. కుమారుడి గెలుపుతో వసంత నాగేశ్వరరావు కుటుంబం మూడు దశాబ్దాల తర్వాత శాసనసభలో అడుగుపెడుతోంది. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో గతంలో ఒక వెలుగు వెలిగిన గంగుల కుటుంబం..భూమా కుటుంబం దెబ్బకు కుదేలై రాజకీయ ప్రాభవాన్ని కోల్పోయింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత గంగుల కుటుంబ వారసుడు విజేంద్రనాథ్ రెడ్డి ..రాష్ట్రమంత్రి భూమా అఖిల ప్రియపై గెలిచి శాసనసభలో ప్రవేశించనున్నాడు.
ప్రస్తుతం ఎన్నిక కాకపోయినా గతంలో ఉమ్మడిరాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కొన్ని ఉదాహరణలున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి , పాల్వాయి గోవర్థనరెడ్డిలు దశాబ్దంన్నర విరామం తర్వాత 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీమంత్రి పి. మాణిక్ రావు దాదాపు మూడుదశాబ్దాల తర్వాత 2007లో మళ్ళీ చట్టసభ(శాసనమండలి)కు ఎన్నికయ్యారు. సెలక్షన్ లిస్టులో ఆయన పేరుంటుందని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం ఊహించలేదు. గీట్ల ముకుందరెడ్డి(పెద్దపల్లి), ఎస్. రామమునిరెడ్డి(కడప)లు కూడా పదిహేనేళ్ళ తర్వాత చట్టసభల్లో (ఒకరు శాసనసభ మరొకరు రాజ్యసభ) అడుగుపెట్టారు. ఈ విధంగా సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయంగా వెలుగులోకి రావటం..ఒకరకంగా రాజకీయ పునర్జన్మ లాంటిదే!