తీవ్ర నీటి ఎద్దడి: రాష్ట్రాలకు కేంద్ర నిధులు

తీవ్ర నీటి ఎద్దడి: రాష్ట్రాలకు కేంద్ర నిధులు

దేశంలోని చాలా భాగాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంతాల్లో దాహార్తిని నివారించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో థర్డ్ పార్టీ అంచనాలు వేయించి అత్యంత అవసరమైన రాష్ట్రాలకు కేంద్ర నిధులు అందజేయనుంది.

కొత్తగా ఏర్పాటు చేసిన జల శక్తి మంత్రిత్వశాఖ వర్గాల మేరకు ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలతో ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ‘తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు నిధులు అందే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ నివేదిక తర్వాత ఏఏ రాష్ట్రాలకు నిధులు దక్కనున్నాయో స్పష్టమవుతుందని’ మంత్రిత్వశాఖలోని అధికారులు చెబుతున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని నీటి సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ లకు ప్రధానమంత్ర నరేంద్ర మోడీ రెండేళ్ల డెడ్ లైన్ విధించినట్టు తెలిసింది. వింధ్యాచల్, బుందేల్ ఖండ్ సహా నీటి కొరత ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ కి కేంద్రం రూ.9,000 కోట్ల నిధులు ఇవ్వనున్నట్టు భావిస్తున్నారు.

మరోవైపు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్న తమిళనాడు, రాష్ట్రంలోని నీటి సరఫరా ప్రాజెక్టుల కోసం తమిళనాడు రూ.5,398 కోట్ల కేంద్ర సాయం కోరింది.ఆర్థిక సాయం కోరుతూ ఆ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మంత్రి ఎస్పీ వేలుమణి గజేంద్ర సింగ్ షెఖావత్ కు గత వారం వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టులలో విల్లుపురం, తిండివనం మున్సిపాలిటీలకు రోజుకు 100 మిలియన్ లీటర్ల నీటిని అందజేసే డిశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు, పైప్ లైన్ పనులతో పాటు మరక్కణమ్, విక్కరవండి పట్టణ పంచాయితీలు, విల్లుపురం జిల్లాలోని 10 పంచాయతీ యూనియన్లలోని1,601 గ్రామీణ ఆవాసాలకు మంచినీటి సరఫరా పనులు కూడా ఉన్నాయి. 16.78 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చే ఈ ప్రాజెక్ట్ కు దాదాపు రూ.2,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా.

దేశంలో జల సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. మే 18న కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు విడుదల చేసిన ఒక ‘కరువు సూచన’లో నీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించింది. దీనిని కేంద్ర జల సంఘం విడుల చేసింది. గత 10 ఏళ్లలో సగటు నీటి నిల్వ గణాంకాల కంటే రిజర్వాయర్లలోని నీటి మట్టం 20 శాతం తక్కువగా ఉన్నపుడు రాష్ట్రాలకు ఈ కరువు సూచనను విడుదల చేయడం జరుగుతుంది.